ఒంటిమిట్టకు బాబు దూరం, ఛార్జీల పెంపుపై వివరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట శ్రీరామ నవమి వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలపై మంత్రి మాణిక్యాలరావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది.
ఈ సందర్భంగా స్వామి వారికి సీఎం చంద్రబాబు పట్టువస్ర్తాలు సమర్పించాలని నిర్ణయించినప్పటికీ మనవడు పుట్టడంతో పురిటిమైల ఉందని పండితులు చెప్పడంతో ఈ వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు భావించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం చినరాజప్ప స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.
కాగా, శ్రీరామ నవమి రోజు ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు రాకపై ఉత్తరాంధ్రసాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. మనవడు పుట్టినందున పురిటిమైలతో ఉన్న చంద్రబాబు నవమి వేడుకల్లో పట్టువస్ర్తాలు సమర్పణకు అనర్హుడన్నారు. నవమి వేడుకలకు చంద్రబాబు దూరంగా ఉండాలని సూచించారు.
కాగా, సింగపూర్ జాతిపిత లీ క్వాన్ యూ అంత్యక్రియలకు చంద్రబాబు హాజరు కానున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం సింగపూర్ వెళ్లనున్నారు.

శాసన సభలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వివరణ
విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఏపీ సీఎం చంద్రబాబు శాసన సభలో వివరణ ఇచ్చారు. విద్యుత్ సంస్కరణలు ప్రవేశ పెట్టింది టీడీపీయే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రూ.28వేల కోట్ల భారం రాష్ట్రం పైన మోపిందన్నారు. ఛార్జీల పెంపు, నియంత్రణకు వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఏపీ విద్యుత్ బోర్డుకు దేశంలోనే నెంబర్ వన్ ర్యాంకింగ్ ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ సరఫరా నష్టాన్ని తగ్గించామన్నారు.
విద్యుత్ లేకపోతే ప్రజలు, ప్రజాప్రతినిధులు గొడవపడతారన్నారు. తాము చేసిన సంస్కరణల ఫలాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేకపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కరోజు బొగ్గు నిల్వలు లేకుండా చేసిందన్నారు. 2004 వరకు మిగులు విద్యుత్ సాధించామన్నారు. విద్యుత్ లోటును 14.5 శాతం నుండి 1.6 శాతానికి తగ్గించామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, పరిశ్రమలు మూతపడ్డాయన్నారు.
తమ పాలనలో తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చామన్నారు. 2004 వరకు తాము మిగులు విద్యుత్ సాధిస్తే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దానిని నిలబెట్టలేకపోయిందన్నారు. విద్యుత్ అమ్మకందార్లకు 17వేల కోట్ల రూపాయల అప్పు మిగిల్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. బొగ్గు గనులపై కేంద్రంతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఈఆర్సీ ప్రతిపాదించిన చార్జీలను తమ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు.
రాష్ట్రాభివృద్ధికి విద్యుత్ అవసరమన్నారు. కేవలం 14 శాతం మంది పైనే ఇప్పటి ఛార్జీల పెంపు ప్రభావం పడ్తుందన్నారు. రానున్న ఐదేళ్లలో యాభై వేల సౌర విద్యుత్ పరికరాలు అందజేస్తామన్నారు. కేవలం 5శాతం మాత్రమే విద్యుత్ పెంచామన్నారు.
దేశం మొత్తంలోనే ఇంటి అవసరాలకు అతి తక్కువ ఛార్జీకి విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయా రాష్ట్రాల్లో యూనిట్‌కు వసూలు చేస్తున్న ఛార్జీలను చదివి వినిపించారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉలికిపడుతోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications