కేసీఆర్‌తో బాబు కాళ్లబేరం, బస్సుల్లో నిద్రలేని రాత్రులు: బొత్స, అంబటి
గుంటూరు: ఓటుకు నోటు వ్యవహారం కేసు నుంచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తప్పించుకోలేరని, ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు ఆదివారం అన్నారు.
ఏసీబీ కేసులకు భయపడుతున్న చంద్రబాబు బస్సులలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు కాళ్ల బేరానికి వెళ్లాడన్నారు. కేసులకు భయపడుతున్న చంద్రబాబు ఏపీలో ప్రజలకు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు రాష్ట్రం పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకొని అయినా ఈ కేసు నుంచి బయటపడాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. రాజకీయాలను వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు.

మత్తయ్యకు చంద్రబాబు ఆశ్రయం కల్పించడం సిగ్గుచేటు అన్నారు. సెక్షన్ 8 గురించి ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ వ్యవహారం చూసిన తర్వాత కూడా చంద్రబాబు బుద్ధి మారడం లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.
బలం లేకున్నా ప్రకాశం - కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను బరిలోకి దింపారన్నారు. ఓట్లను కొనుగోలు చేయాలనే దుర్బుద్ధితోనే చంద్రబాబు ఇలాంటి పని చేశారన్నారు. రేవంత్ కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని వాసిరెడ్డి పద్మ అన్నారు. బాబు సీఎంగా ఉండటం దురదృష్టకరమన్నారు.












Click it and Unblock the Notifications