బాధాకరం, ఓ బ్యాచ్‌ను వెంటపెట్టుకుని...: చంద్రబాబు, పరోక్షంగా జగన్‌పై దాడి
హైదరాబాద్: తుని సంఘటనలు చాలా బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తునిలో హింస చెలరేగిన నేపథ్యంలో ఆయన ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. కొందరు రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. కొందరు కావాలనే ఇటువంటి అల్లర్లను సృష్టిస్తున్నారని అన్నారు.
కాపు ఆందోళనకారులు హింసకు పూనుకున్న ఘటనల్లో ఓ రైలు పూర్తిగా కాలిపోయిందని, 25 వాహనాలను తగులబెట్టారని, ముగ్గురు సిఐలు, ముగ్గురు ఎస్సైలు, 8 మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారని చంద్రబాబు చెప్పారు. ఓ ఎస్సై, ఓ కానిస్టేబుల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. తుని అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్లను తగులబెట్టారని ఆయన చెప్పారు.
విభజన తర్వాత అడుగడుగునా సమస్యలు ఎదరువుతున్నాయని ఆయన అన్నారు. తుని ఘటనే కాదు పట్టిసీమ, అమరావతిలకు కూడా రాజకీయ నాయకులు అడ్డుపడ్డారని ఆయన అన్నారు. తునిలో భారీగా పోలీసులను దింపుతామని అన్నారు.

రెచ్చగొట్టే పరిస్థితి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కల్పించాయని ఆయన అన్నారు. ప్రణాళిక ప్రకారం ఆ పార్టీలు ఈ పరిస్థితిని తెచ్చాయని ఆయన అన్నారు. తాను చేసిన ప్రయత్నాలను బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయం కోసం ఇటువంటి పనులు చేస్తారా అని ఆయన అడిగారు. రౌడీయిజానికి హద్దు లేదా, రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయని ఆయన అన్నారు. అటువంటి వారు రాజకీయాల్లో రావడం దురదృష్టకరమని అన్నారు.
అసెంబ్లీలో అలా చేస్తారా అని అడిగారు. హింసాత్మక సంఘటనల వల్ల కాపులకు నష్టమని ఆయన అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆయన అన్నారు. రాష్ట్రం తగులబడితే వారికి ఆనందమని ఆయన అన్నారు.
కాపుల రిజర్వేషన్ల కోసం కమిషన్ కూడా వేశామని ఆయన చెప్పారు. పద్ధతి ప్రకారం చేయకపోతే న్యాయస్థానాల్లో నిలువలేవనే ఉద్దేశంతో కాపులకు చట్ట పరిధిలో నిలిచేలా రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నానని ఆయన చెప్పారు.
ఇది సున్నితమైన విషయమని, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే తమ రిజర్వేషన్లు పోతాయని బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని బీసీలకు చెప్పి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని చూస్తున్నామని ఆయన చెప్పారు.
విజయవాడ మొత్తం కాల్ మనీ సెక్స్ రాకెట్ మయం అయిపోయినట్లు చేశారని ఆయన అన్నారు. ఎక్కడా లేనట్లు, విజయవాడలోనే ఉన్నట్లు చెసారని ఆయన అన్నారు. అందరూ సహకరించాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి అంటే లెక్క లేదు, వ్యవస్థ అంటే లెక్క లేదని, ఓ బ్యాచ్‌ను వెంటేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడుతారా అని ఆయన అన్నారు. సమావేశాన్ని నిర్వహించిన రాజకీయ పార్టీలే తుని సంఘటనలకు బాధ్యత వహించాలని అన్నారు. రాజకీయ నాయకుల ముసుగులో నేరాలు చేసేవారిని ఏం చేయాలి, పోలీసులే నియంత్రించాలని అన్నారు.
కెమెరాలు పనిచేయలేదు, ఏవీ పనిచేయలేదు, ఇది కుట్ర కాదా అని అన్నారు. కాపు రిజర్వేషన్లపై తాను విజ్ఞప్తి చేశానని, తమ వాళ్లు కూడా అపీల్ చేశారని ఆయన అన్నారు. కాపులకు నేనెప్పుడు ఏం చేయలేదని అడిగారు. ఎవరెవరు కలిశారు, ఎందుకు కలిశారు చెప్పాలని ఆయన తుని కాపు గర్జనపై అడిగారు.
ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు, ఈ రాష్ట్రం పనికి రాదని బయటకు చెప్తారా అని అడిగారు. తన ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తామంటే సహిస్తామా, ఎక్కడికి పోతున్నామని అన్నారు.
జీవో ఇస్తాను, అమలవుతుందా...
తాను రేపే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి కాపు రిజర్వేషన్లపై జీవో ఇష్యూ చేస్తానని, దాన్ని అమలు చేయడం సాధ్యమవుతుందా అన్నారు. జీవో జారీ చేసిన తర్వాత కోర్టులు కొట్టేస్తే, జీవో ఇచ్చారు, అమలు కాకుండా చేశారా అని అనరా అని చంద్రబాబు అన్నారు. రాయలసీమకు ఏం అన్యాయం చేశామని అడిగారు. విద్యాసంస్థలు ఎక్కువగా అక్కడికి వస్తున్నాయని, నిధులు అక్కడే ఖర్చు చేస్తున్నామని ఆయన అన్నారు.
కాపు రిజర్వేషన్ల విషయాన్ని జఠిలం చేయవద్దని, తాను రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. జీవో ఇస్తే మునిగిపోతామని కాపులు ఇప్పటికే చెప్పారని, అందువల్ల తాము చట్టానికి నిలబడే విధంగా రిజర్వేషన్లు కల్పించాలని చూస్తున్నానని ఆయన చెప్పారు.
కాపులు చేయలేదు..
అవాంఛనీయ సంఘటనలకు పాల్పడింది కాపులు కాదని, వారు క్రమశిక్షణతో ఉన్నారని ఆయన అన్నారు. నిధుల విడుదలపై చంద్రబాబు ప్రతిస్పందించారు. నిధులు ఉండాలి కదా అన్నారు. రాష్ట్ర విభజన సమస్యలను తెచ్చిపెట్టిందని, మనం కోరుకుంది కాదని, మన నెత్తి మీద రుద్దారని ఆయన అన్నారు. రేపు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉండకపోవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications