రాజధాని ప్లాన్‌కే రూ.2500 కోట్లు! కేంద్రంకు బాబు లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజధాని ప్లాన్‌కే రూ.2500 కోట్లు కావాలని, సాయం కోసం కేంద్రానికి లేఖ రాయాలని చంద్రాబాబు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వానికి పురపాలక శాఖ తరఫున లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయించారు.
రాజధానిలో మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? నిర్మాణాలు ఎలా కొనసాగాలి? తదితర అంశాలను అధికార యంత్రాంగం పరిశీలించాల్సి ఉందని, అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగు రోడ్డు, మెట్రో రైలు, తాగునీటి వసతులు తదుపరి సదుపాయాల ఏర్పాటుపై సలహాదారులను నియమించి ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని, వీటిని చేపట్టేందుకు తగిన నిధులు అందుబాటులో లేనందున ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రూ.15వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రణాళిక, నిర్మాణం కోసం కేంద్రం సాయం చేయాలని కోరనున్నారు.
రుణమాఫీపై మధ్యంతర నివేదిక
ఎన్నికల వాగ్దానంలో భాగంగా రైతుల రుణమాఫీపై ప్రభుత్వం చేస్తోన్న కసరత్తు ఓ కొలిక్కి రానుంది. నాబార్డు మాజీ ఉన్నతాధికారి పి కోటయ్య నేతృత్వంలోని కమిటీ చంద్రబాబు ఆదివారం మధ్యంతర నివేదికను ఇవ్వబోతోంది. శనివారం కూడా ఈ కమిటీ సభ్యులు బ్యాంకు అధికారులతో చర్చలు జరిపారు. మధ్యంతర నివేదిక ఎలా ఇవ్వాలి.. అందులో ఎలాంటి సిఫారసులు చేయాలన్న దానిపై అధ్యయనం చేశారు. మధ్యంతర నివేదికను సిఎంకు ఇచ్చిన తర్వాత మరోసారి కసరత్తు చేసి అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఈ నెల 30న కమిటీ తన తుది నివేదికను అందజేస్తుంది.












Click it and Unblock the Notifications