Tdp Rajya Sabha Contest: ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు .. !
ఏపీలో త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే వైసీపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే ముగ్గురు అభ్యర్ధుల్ని ఖరారు చేసి బీఫామ్ లు కూడా ఇచ్చేసింది. దీంతో ఎమ్మెల్యేల బలం లేని టీడీపీ తాము పోటీ చేయాలా లేక దూరంగా ఉండిపోవాలా అన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఇవాళ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి ఇదే అంశంపై సీనియర్లతో చర్చలు జరిపారు.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కానీ ప్రస్తుతం టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో గంటా శ్రీనివాస్ రాజీనామాతో 22 మంది అయ్యారు. వీరిలో నలుగురు ఇప్పటికే వైసీపీకి ఫిరాయించారు. అదే సమయంలో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా ఉన్నారు. దీంతో 22 మంది ఎమ్మెల్యేల బలం కలిగిన టీడీపీకి మరో 22 మంది కలిస్తే తప్ప రాజ్యసభ ఎన్నిక గెలిచే పరిస్ధితి లేదు.

మరోవైపు వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు తర్వాత సీట్లు కోల్పోయిన ఎమ్మెల్యేలు భారీగా తమవైపు ఫిరాయిస్తారని టీడీపీ లెక్కలేసుకుంది. కానీ ఆశించిన స్ధాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు స్వరం పెంచడం లేదు. అధికార పార్టీని కాదని టీడీపీకి మద్దతిస్తే ఇబ్బందులు ఉంటాయనే భావనలో ఉన్నారు. దీంతో సదరు ఎమ్మెల్యేలు తాము నిలబెట్టే రాజ్యసభ అభ్యర్ధికి మద్దతిస్తారా లేదా అన్న దానిపై చంద్రబాబు క్లారిటీకి రాలేకపోతున్నారు. దీనిపై క్లారిటీ వచ్చే తప్ప టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. మరోవైపు ఈ నెల 15తో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.












Click it and Unblock the Notifications