Chandrababu quash petition:చంద్రబాబుకు తప్పని నిరీక్షణ... తేలేది ఎప్పుడంటే..!
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన హైకోర్టులో సుదీర్ఘ విచారణ సాగింది. చంద్రబాబు తన పైన అక్రమంగా కేసు నమెదు చేసారని క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. రిమాండ్ రివ్యూ పిటీషన్ సైతం దాఖలు చేసారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు..సీఐడీ లాయర్లు ఈ పిటీషన్ పైన తమ వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న హైకోర్టు ఈకేసు తీర్పును రెండ్రోజులకు రిజర్వ్ చేసింది.
ఈ కేసులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, సిద్దార్ధ్ లూధ్రా వర్చ్యువల్ గా వాదనలు వినిపించారు. అసలు ఈ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్దమని పేర్కొన్నారు. చంద్రబాబు పైన రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసారని వాదించారు. కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని కోర్టు ముందు వివరించారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే రిమాండ్ రిపోర్టు పైన ఏసీబీ కోర్టులో జరిగిన వాదనల్లోనే సీఐడీ నిబంధనలు పాటించలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసారని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం నమోదు పైన వాదనల్లో ప్రస్తావించారు.

17 ఏ సెక్షన్ ఏం చెబుతోంది..సీఐడీ ఏం చేసిందనేది చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసారని కోర్టుకు నివేదించారు. ఈ రోజు జరిగిన వాదనల్లో చంద్రబాబు తరపున హరీష్ సాల్వే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం చట్ట విరుద్దంగా సాగిందని పేర్కొన్నారు. ఇటు సీఐడీ తరపున ముఖుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. క్వాష్ పిటీషన్ కు చంద్రబాబు అనర్హుడని వాదించారు. ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదన్నారు. రెండేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత అధారాలతోనే అరెస్ట్ చేసారని వివరించారు. విచారణ చేస్తున్న అధికారులకు స్వేచ్చ ఇస్తూ క్వాష్ పిటీషన్ కొట్టేయాలని కోరారు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జ్ షీట్లు అయినా వేయచ్చు..ఎంతమందినైనా విచారించవచ్చని గుర్తు చేసారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలిందని చెప్పారు.
బోగస్ కంపెనీల ద్వారా ప్రజాధనం మళ్లించారని కోర్టు ముందు వాదించారు. ఈ డీల్ కు కేబినెట్ ఆమెదం లేదని రోహిత్గీ కోర్టుకు నివేదించారు. నిధులు మళ్లించిన షెల్ కంపెనీలపై ఆరా తీస్తున్నామని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచురులతో కలిసి రూ 317 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసారని తన వాదనల్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏపీ హైకోర్టులో మరో బెంచ్ లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో దాఖలు చేసిన పిటీషన్ విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసులో విచారణలో ఉన్న సమయంలోనే సీఐడీ అమరావతి కేసులో పీటీ వారెంట్ కోసం కోర్టును ఆశ్రయిస్తుందనే సమాచారంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ నెల 21న తదుపరి విచారణ కొనసాగించాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications