హైకోర్టులో కీలక మార్పులు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ అతనివద్దకు
హైకోర్టు న్యాయమూర్తులు విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టులను(రోస్టర్) మారుస్తూ ఏపీ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా నలుగురు జడ్జిలు రావడంతో ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రోస్టర్ లో మార్పులు చేశారు. శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.
2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు, బెయిల్ పిటిషన్లు, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విచారణను జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు కేటాయించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ మల్లికార్జునరావు వద్ద సోమవారం విచారణ జాబితాలోకి వచ్చాయి. తాజాగా జారీచేసిన రోస్టర్ లో జస్టిస్ బీఎస్ భానుమతికి హోంశాఖకు చెందిన ఛార్జిషీట్లు, ఎఫ్ ఐఆర్, క్వాష్ పిటిషన్లను అప్పగించారు. 2022 నుంచి దాఖలైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలనే పిటిషన్లను ఆమె విచారిస్తారు.

జస్టిస్ నూనెపల్లి హరినాథ్ కు సింగిల్ బెంచ్ కేటాయించారు. ఏసీబీ, సీబీఐ కేసుల విషయంలో 2014 వరకు నమోదైన పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు. సీనియర్ జడ్జిలతో కలిసి డివిజన్ బెంచ్ పంచుకునేలారోస్టర్ నిర్ణయించారు. జస్టిస్ ఏవీ శేషసాయితో జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావుతో జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ తో జస్టిస్ న్యాపతి విజయ్ డివిజన్ బెంచ్ లో కేసులను విచారిస్తారు.
బెయిల్ పిటిషన్లను విచారించిన జస్టిస్ కె.సురేష్ రెడ్డికి ఎఫ్ ఐార్, అభియోగ పత్రాలను కొట్టేయాలంటూ 2017 వరకు దాఖలైన పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు. 2018 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్ల విచారణను కేటాయించారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ల కొట్టివేత పిటిషన్లపై విచారణ చేసిన జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డికి ఒరిజినల్ సివిల్ దావాలు, ఒరిజినల్ పిటిషన్లు, వాణిజ్య సంబంద కేసుేలు, కంపెనీ అప్లికేషన్లు, కంపెనీ పిటిషన్లు, 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, ఇతర సబ్జెక్టులను విచారిస్తారు.












Click it and Unblock the Notifications