ఇంటి పేరే ఆమె పెట్టుబడి: మాజీ ఎంపీ కుమార్తెనంటూ సెలూన్ పేరిట రియల్ దందా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఇంటి పేరుని పెట్టుబడి పెట్టి మోసాలకు పాల్పడుతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన ఉదంతం వెలుగు చూసింది. హైదరాబాద్ కేంద్రంగా ఖరీదైన సెలూన్‌ని నిర్వహిస్తున్న ఆమె నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో కొత్త మోసానికి తెరతీసింది.

గుంటూరుకు చెందిన మాజీ ఎంపీ కుమార్తెనని, జిల్లాకు చెందిన ఓ ఎంపీకి మనుమరాలినని నమ్మించి మోసానికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే... గుంటూరు పట్టణంలోని వెంగళరావునగర్‌కు చెందిన తెలుగు యువత నాయకుడు జూబ్లీహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌ రోడ్డు నెంబరు 13లో స్నేహితులతో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు.

ఆయన కార్యాలయం కింద ఉన్న ఇంటర్నేషనల్‌ సెలూన్‌ నిర్వాహకురాలైప ఆమె, ఇరువురు స్నేహితులు తెలుగు యువత నాయకుడికి పరిచయం అయ్యారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నామని, ఏపీ రాజధాని ప్రాంతంలో భూములు కొన్నామని చెప్పారని బాధితుడు తెలిపాడు.

Cheating woman arrested in guntur

మా వ్యాపారంలో రూ. కోటి పెట్టుబడి పెడితే అధికలాభాలు వస్తాయని నమ్మించినట్టు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రెండు దఫాలుగా రూ. 75 లక్షలు తీసుకున్నారని తెలిపాడు. విషయం ఏమిటని వాకబు చేస్తే.. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయలేదని తేలిందన్నాడు.

అంతేకాదు మాజీ ఎంపీ కుమార్తె, ఎంపీకి మనుమరాలు కూడా కాదని.. మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్నట్టు తేలిందన్నాడు. మాజీ ఎంపీ ఇంటిపేరుతో కొనసాగుతుందని తెలిపాడు. ఆమె ఇంటిపేరు కూడా అది కాదేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. తప్పుడు ఆధార్‌కార్డులు, పాస్‌పోర్టు కూడా పొందిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆమె అనుచరుల్లో ఒకరు గుంటూరు వారి తోట 1వ లైన్‌కు చెందిన యువకుడు ఉన్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆమె వివరాలు సేకరిస్తున్నారు. గతంలో ఇంకెవరినైనా మోసం చేసిందనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు మోసగించిన మహిళతో సహా ఇద్దరు యువకులపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

తప్పుడు వివరాలతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో ఉంచినట్టు బాధితుడు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు. గతంలో ఆమెపై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో బంగారు వ్యాపారిని మోసం చేసినట్టు చీటింగ్‌ కేసు నమోదైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur police arrested women in a cheating case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి