తప్పుడు రిజిస్ట్రేషన్ లకు చెక్ ... ఏపీ సర్కార్ కీలక నిర్ణయం .. రిజిస్ట్రేషన్స్ వీడియో రికార్డింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగే అక్రమాలు నిరోధించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు వీడియో రికార్డింగ్ చేయడానికి, దానిని పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టుగా
రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాచరణను రూపొందిస్తోంది. ముందుగా 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని వీడియో రికార్డింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రక్రియను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర స్థాయిలోని కంట్రోల్ రూమ్ కు ఈ వీడియో రికార్డింగ్ ప్రక్రియను అనుసంధానించి, పర్యవేక్షించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్లలో అక్రమాల నియంత్రణ సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలను నియంత్రించడం లక్ష్యం
భూముల కొనుగోలులో అక్రమాలు, డబుల్ రిజిస్ట్రేషన్ లు, ఒకరికి బదులుగా ఒకరు వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, ఇక వారికి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సహకరించడం వంటి అనేక ఆరోపణల నేపథ్యంలో అక్రమాలకు చెక్ పెట్టడం కోసం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలను నియంత్రించడం కోసం చాలా కాలంగా ప్రభుత్వాలు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే . కానీ అక్రమాల నియంత్రణలో ప్రభుత్వం విఫలం అవుతున్న పరిస్థితి ఉంది.

పారదర్శకతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వ ప్రయోగం
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పాలనలో పారదర్శకతతో వ్యవహరిస్తామని చెప్తున్న నేపథ్యంలో తీసుకున్న తాజా నిర్ణయం, చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఏ మేరకు అమలు అవుతుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రక్షాళన కోసం నడుం బిగించిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర భూముల సర్వే చేసి భూముల ప్రక్షాళనకు నడుం బిగించారు . తాజాగా రిజిస్ట్రేషన్ శాఖపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు .












Click it and Unblock the Notifications