ఆ విద్యార్థినికి చంద్రబాబు ఇచ్చిన చెక్కు చెల్లలేదు.. ఎందుకు?
అనంతపురం : ప్రతిభా పురస్కారాల్లో భాగంగా.. ఓ విద్యార్థినికి సీఎం చంద్రబాబు అందజేసిన చెక్కు చెల్లకుండా పోయింది. బ్యాంకు అధికారుల తప్పిదం మూలంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టుగా తెలుస్తోంది. బ్యాంకు అధికారులు చెక్కు చెల్లదని చెప్పడంతో.. ప్రస్తుతం ఆ విద్యార్థిని ఆనందం కాస్త ఆవిరైనట్టయింది.
కాగా, అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నామకల్లు ప్రవలిక అనంతపురం ఎస్కే యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే 2016 సంవత్సరానికి ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. అక్టోబర్ 13న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం, రూ.20వేల డీడీ అందజేశారు.

డీడీ తీసుకుని హిందూపురం ఆంధ్రాబ్యాంకుకు వెళ్లిన ప్రవలికకు బ్యాంకు సిబ్బంది షాక్ ఇచ్చారు. డీడీపై తొలుత ప్రవలిక అనే పేరుకు బదులు హారిక అనే పేరు ముద్రించిన హైదరాబాద్ సిండికేట్ బ్యాంకు సిబ్బంది.. తప్పును సరిదిద్దడం కోసం హారిక పేరుపై బ్యాంకు సీల్ వేసి కనిపించకుండా చేశారు. దీంతో చెక్కు చెల్లదని తేల్చి చెప్పారు ఆంధ్రాబ్యాంక్ సిబ్బంది.
చెక్కు చెల్లదని చెప్పడంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది ప్రవలిక. ఇప్పుడు దాన్ని సరిచేయాలంటే హైదరాబాద్ కు వచ్చి డీడీ సమస్యను పరిష్కరించుకోవాలి. మరి విషయం అధికారుల దృష్టికి వెళ్లిందో లేదో!












Click it and Unblock the Notifications