రేపటి నుంచి మాజీ ఎంపీ నిరహార దీక్ష - ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..!!
ఏపీలో మరోసారి కాపు రిజర్వేషన్ల అంశం తెర పైకి వచ్చింది. కాపులను బీసీల్లో చేర్చే అంశం చంద్రబాబు హాయంలో నిరసనలు - సభలు జరిగాయి. ఇప్పుడు కాపులకు కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అయిదు శాతం కేటాయించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దీని పైన ఇప్పటికే మాజీ ఎంపీ, కాపు సేన అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు. డిసెంబర్ నెలాఖరులోగా దీని పైన నిర్ణయం ప్రకటించకుంటే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని..రేపటి నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్లు జోగయ్య ప్రకటించారు.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలను కాపుల్లో చేర్చుతామని టీడీపీ హామీ ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇదే అంశం పైన దీక్షకు దిగారు. తుని వద్ద జరిగిన కాపు సభ అదుపు తప్పి రైలు దహనం వరకు వెళ్లింది. ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే అంశంపైన అధ్యయనం కోసం మంజునాధ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ తరువాత 2019లో కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రకటించింది. అందులో అయిదు శాతం కాపులకు కేటాయిస్తే ఏపీ ప్రభుత్వం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తీర్మానం చేసింది. ఆ తరువాత ఏపీలో ప్రభుత్వం మారింది. ఇదే అంశానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ లో కేంద్రం నుంచి స్పష్టత కోరారు. కాపు రిజర్వేషన్ల అంశం పైన ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఎవరికి ఏ మేర ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంగా కేంద్రం స్పష్టం చేసింది. దీంతో, ఇప్పుడు కాపులకు గత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని హరి రామజోగయ్య కోరుతున్నారు. గతంలో ఇదే తరహాలో బీజేపీ నేత లక్ష్మీనారాయణ సీఎంకు లేఖ రాసారు. తాజాగా ముద్రగడ పద్మనాభం కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసారు. అందులో కాపు రిజర్వేషన్లపైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుప్రీంతో పాటుగా కేంద్రం ఇచ్చిన స్పష్టత గురించి ప్రస్తావించారు. ఇప్పుడు హరిరామజోగయ్య డెడ్ లైన్ ఫిక్స్ చేసి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. రేపటి నుంచి పాలకొల్లు గాంధీ సెంటర్ లో దీక్ష చేస్తానని ప్రకటించారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. భగ్నం చేసినా తన దీక్ష కొనసాగిస్తానని జోగయ్య స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications