ఎట్టకేలకు రుషికొండ భవనాల వినియోగం పై నిర్ణయం..!!
రుషికొండ భవనాల వినియోగం పై ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు వీటి వినయోగం పైన సుదీర్ఘ కసరత్తు చేసారు. మంత్రివర్గ ఉప సంఘం పలు విడతలుగా సమావేశమై.. పలువురి అభిప్రాయ సేకరణ చేసింది. తాజాగా భవనాలను పరిశీలించిన సబ్ కమిటీ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసేందుకు సిద్దమైంది. ఈ భవనాల వినియోగం పైన ఒక నిర్ణయానికి వచ్చారు.
రుషికొండ భవనాలను అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్‌గా మారుస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ వెల్లడించింది. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు రిసార్ట్‌గానే కొనసాగించాలని భావిస్తున్నా మని చెప్పింది. దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో పెద్ద సంస్థలకు ఇస్తామని తెలి పింది. గత వైసీపీ ప్రభుత్వం సుమారు రూ. 450 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు పరిశీలన చేసారు. భవనాలను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం లాసన్స్‌బే కాలనీలోని యాత్రీ నివాస్‌లో వారు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రుషికొండ ప్యాలె్‌సను ఆతిథ్య రంగానికే కేటాయించాలని ప్రాథమికంగా కమిటీ అభిప్రాయపడుతోందని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం ప్రజల సెంటిమెంట్‌ను కూడా గౌరవిస్తూ ఒక బ్లాక్‌ను కల్చరల్ లేదా హెరిటేజ్ సెంటర్ నిర్వహణకు కేటాయించేందుకు సూచన చేస్తామన్నారు. త్వరలోనే తమ నివేదికను ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో సమర్పిస్తామన్నారు.

వచ్చే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం
కాగా, ఈ భవనం వినియోగంపై ప్రజల నుంచి అభిప్రాయాలు కోరినప్పుడు పలు ప్రతిపాదనలు వచ్చాయని, కొందరు మానసిక వైద్యశాలగా మార్చాలని, స్టేట్ గెస్ట్ హౌస్‌గా ఉంచాలని, కొందరైతే కూల్చేయాలని కూడా సూచించారన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకు రిసార్ట్‌గానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పారు. భవనం నిర్వహణకు నెలకు రూ.25 లక్షలు, అందులో విలువైన వస్తువుల నిర్వహణకు రూ.1.5 కోట్లు ఖర్చు అవుతోందన్నారు. కొన్ని సంస్థలు రుషికొండ కింద ఉన్న భూమి కూడా ఇస్తే అభివృద్ధి చేస్తామని కోరాయని, త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చి, ఆసక్తి కలిగిన సంస్థలను ఆహ్వానిస్తామని వెల్లడించారు. సామాన్య ప్రజలకు, ప్రకృతి ప్రేమికులకు రుషికొండ ప్యాలెస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.













Click it and Unblock the Notifications