అవకాశాలు: చెంగ్దూ నగరానికి చంద్రబాబు ఫిదా
బీజింగ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనాలోని చెంగ్దూ నగరానికి ఫిదా అయ్యారు. ఐదో రోజు చైనా పర్యటనలో ఉన్న ఆయన, చెంగ్దూ నగరం చాలా అందంగా ఉందని తెలిపారు. చెంగ్దూ నగరంలో ఎంతో పరిశుభ్రంగా, సుందరంగా ఉందని పేర్కొన్నారు. గురువారం చంద్రబాబు, ఆయన బృందం చెంగ్దూలో నగర మేయర్, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. ఏపి సాఫ్ట్‌వేర్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు తెలిపారు. ఏపి, సిచువాన్ పరస్పర ఒప్పందం కుదుర్చుంటామని, ఏపిలోని అవకాశాలను అందిపుచ్చుకుంటామని చెంగ్దూ మేయర్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చైనా సహకారం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలనుకుంటున్నానని ఎవరికైనా ఇదే మంచి అవకాశమన్నారు. చైనాలో అద్భుతమైన నగరాలను నిర్మించారు, పునర్నిర్మించుకున్నారని కొనియాడారు. అద్భుతమైన రాజధానిని నిర్మించుకునే అవకాశం తమకూ దొరికిందన్నారు. అత్యంత ఆధునాతనంగా స్మార్ట్ సిటీ నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఇటీవలే సింగపూర్‌తో ఓ అవగాహనకు వచ్చామన్న ఆయన ఇప్పటికే వాళ్లు ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. రాజధానిపై మరో రెండు నెలల్లో మాస్టర్ ప్లాన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నగరంలో ఎన్నో అవకాశాలు వచ్చాయన్నారు. పరిశ్రమలు, హార్డ్‌వేర్, సేవారంగాలకు అక్కడ పుష్కల అవకాశాలున్నాయని ఆయన వివరించారు.
అమరావతిని చైనీయుల రెండో స్వగృహంగా రూపుదిద్దుతామని అన్నారు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అందుకోసం పథక రచన చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. చైనా పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి వనరులతోపాటు నిపుణులైన మానవ వనరులు కూడా ఉన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications