వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలలను అనుమతించని పోలీసులు.. మంగళగిరి స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించేందుకు మంగళగిరి పోలీసుస్టేషన్ కు చేరుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మంగళగిరి: పోలీసుల తీరు కారణంగా మంగళగిరి పోలీసుస్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవాణాశాఖ ఉన్నతాధికారులపై అనుచితంగా ప్రవర్తించిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి మంగళగిరి పోలీసుస్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే.
ఆయనను పరామర్శించేందుకు ఐదుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లగా, పోలీసు స్టేషన్ గేట్లు మూసివేసి, కనీసం వారిని పోలీసు స్టేషన్ ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గేటు వెలుపలే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

తోటి శాసనసభ్యులుగా చెవిరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన తమను కనీసం పోలీసు స్టేషన్ లోపలికి కూడా అనుమతించకుండా గేట్లు వేసేయడం దారుణమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కాసేపు 144 సెక్షన్ ఉందంటున్నారని, మరికాసేపు ఇంకేదో చెబుతున్నారని, పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు.
రవాణా శాఖ కమిషనర్ కు, ఆయనకు భద్రతగా ఉన్న పోలీసులకు జరిగిన అవమానానికి నిరసనగా తాము పోరాడుతుంటే పోలీసులు తమకు కూడా సహకరించకపోవడం దారుణమన్నారు. అసలు పోలీసులు తమకు సరైన సమాధానమే ఇవ్వడం లేదని పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.
ఇదే ప్రాంగణంలో ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయని, ఇలా గేట్లు మూసివేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. గేట్లు మూసివేయడానికి కారణం ఏంటో చెప్పాలని తాము రాతపూర్వకంగా అడిగినా జవాబు లేదని, ఇన్ స్పెక్టర్ ను అడిగితే ఆయనా స్పందించడం లేదని పేర్కొన్నారు.
144 సెక్షన్ ఎప్పటినుంచి ఉందో చెప్పమని అడిగితే సమాధానం లేదని, ఇంత అధ్వాన్నంగా, ఇంత అన్యాయంగా ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయని, ఇంతకంటే దారుణం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఈ మాత్రం దానికి మళ్లీ నవ్యాంధ్రప్రదేశ్ అనే పేరు పెట్డడమా అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications