ఆదుకోండి ప్లీజ్.. ప్రాణం ఖరీదు రూ. 16 కోట్లు !
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఓ జంటకు తొలి సంతానంగా జన్మించింది ఓ చిన్నారి. చిరునవ్వులు చిందించే ఆ పాప ముఖం చూస్తే.. ఏ మనసైనా కరిగిపోవాల్సిందే. అమాయకత్వంతో నిండిన కళ్లు.. బోసి నవ్వు చూస్తే చాలు ఎంతటి కష్టాన్ని అయినా మర్చిపోవచ్చు. కానీ ఆ మధ్య తరగతి జంటకు.. పాప ప్రయాణం ఖరీదు రూ.16 కోట్లు అని తెలిస్తే.. ఆ చిన్నారిని కాపాడుకోవడానికి సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నా.. ఎక్కడ కాపాడుకోలేనేమో అనే భయం.. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ఓ అరుదైన వ్యాధి రూపంలో మృత్యువు చిన్నారిని వెంటాడుతోంది. ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే ఆ పాపకు అక్షరాల రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పుడే ఆ పాప ఆరోగ్యంగా జీవించగలదంటున్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆదుకోండి అంటూ వేడుకుంటున్నారు.

ఈ విషాద గాధ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన డొక్కా ఈశ్వర్, శ్రావణిల మొదటి సంతానం మోహన. ఈశ్వర్ ఒక చిన్న ఉద్యోగి. కడియం ఏపీ పేపర్ మిల్లులో తక్కువ జీతానికి పని చేస్తున్నారు. ఆ జీతం డబ్బులతో కుటుంబపోషణే అతనికి భారంగా ఉంటుంది. కానీ పాప పుట్టిందనే ఆనందం వారికి ఎన్నో రోజులు నిలవలేదు. రెండు నెలలకే ఆ పాప అనారోగ్యానికి గురైంది.
హాస్పిటల్ కు తీసుకువెళ్లగా.. అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. స్పైనల్ మస్కుయలర్ ఆట్రోఫీ (ఎస్‌యంఏ) టైప్-1 సమస్య వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి శరీరంలోని కండరాలను నిర్వీర్యం చేస్తుంది. రోజులు గడిచే కొద్ది చేతులు, కాళ్లు కదలవని... చివరికి ఊపిరి కూడా తీసుకోలేక మరణిస్తారని.. ఈ వ్యాధితో పుట్టిన పిల్లలు రెండేళ్లలో మరణిస్తారని వైద్యులు వెల్లడించారు.
దీంతో హైదరాబాద్‌లోని ప్రముఖ నిమ్స్, రైన్‌బో ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. అయితే ఈ అమ్మాయికి రెండు ఏళ్లలోపు ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడు మాత్రమే ఆ పాప ఆరోగ్యంగా ఉండగలుగుతుందన్నారు వైద్యులు. లేకపోతే పాప ప్రాణాలకే ప్రమాదం అన్నారు. అప్పటివరకు ఆరు లక్షల రూపాయల విలువైన సిరప్‌ను పాపకు అందించాల్సి ఉంటుంది అన్నారు. అంతటి ఖరీదైన వైద్యం అందించేందుకు ఆర్ధికంగా తమ వల్ల కావట్లేదని.. పాప బతకాలంటే దాతలు సహకరించండి అంటూ ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దాతల సహకారం అందించాలని కోరుతున్నారు. ఆ పాపను ఆదుకోవాలని, ఆర్థిక సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే పాప బతుకుతుందంటున్నాటు పాప తండ్రి ఈశ్వర్. 94411-01670 కు సంప్రదించాలని ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications