జగన్ కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు: భారతి
హైదరాబాద్: తండ్రిని చూడడానికి తమ పిల్లలు ఎదురు చూస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి అన్నారు. జగన్‌కు బెయిల్ రావడంపై ఆమె స్పందించారు. జగన్‌కు బెయిల్ రావడం సంతోషంగా ఉందని, న్యాయం గెలిచిందని ఆయన బాబాయ్, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో తమ పార్టీ గెలుస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. జగన్‌కు బెయిల్ రావడంపై రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోందని ఆయన అన్నారు. కాగా, జగన్‌కు బెయిల్ రావాలని కోరుతూ సోమవారం ఉదయం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పూజలు చేస్తూ వచ్చారు.

వైయస్ జగన్‌కు బెయిల్ వచ్చిన నేపథ్యంలో పార్టీ నాయకులు ఎంవి మైసురా రెడ్డి, శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి జనగ్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద, జగన్ ఇంటి వద్ద పెద్ద యెత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు.
జగన్‌కు బెయిల్ రావడంతో వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, షర్మిల ఆనందంగా ఉన్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్‌కు బెయిల్ కోసం కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడివి సిగ్గుమాలిన చేష్టలని ఆయన అన్నారు.
బెయిల్ కోసం కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై శాసనసభ్యుడు కొడాలి నాని తీవ్రంగా ప్రతిస్పందించారు. చంద్రబాబుకు మతి చెడిందని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారని, కాంగ్రెసుతో కలిసిపోవాలనుకుంటే జగన్ ఇన్నాళ్లు జైలులో ఉండేవారు కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications