శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గౌరవం.. ఆ విషయంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానం
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే నాలుగవ ఫ్యామిలీ ఫ్రెండ్లీ విమానాశ్రయంగా శంషాబాద్ విమానాశ్రయం గుర్తింపు పొందింది. బ్రిటన్ కు చెందిన అట్రాక్షన్ టికెట్ డాట్ కామ్ అనే పర్యాటక సంస్థ ప్రపంచంలోని ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్స్ పైన చేసిన సర్వేలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నాలుగవ స్థానం దక్కింది.
140కిపైగా విమానాశ్రయాలపై సర్వే
ఈ అరుదైన స్థానం లభించడం పట్ల జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంతోషం వ్యక్తం చేస్తుంది. బ్రిటన్ కి చెందిన అట్రాక్షన్ టికెట్ డాట్ కామ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140కిపైగా విమానాశ్రయాలను పరిశీలించింది. విమానాశ్రయం యొక్క విస్తీర్ణం, కుటుంబసౌకర్యాలు, పిల్లలకు ఉన్న ఆటస్థలాలు, భద్రత, విశ్రాంతి సదుపాయాలు, wi-fi సౌకర్యం, గూగుల్ రివ్యూలు వంటి అనేక అంశాలను ఆధారంగా తీసుకొని రేటింగ్ ఇచ్చారు.

హైదరాబాద్ విమానాశ్రయం అరుదైన రికార్డ్
హైదరాబాద్ విమానాశ్రయం 20 పాయింట్లలో 18.5 పాయింట్లు సాధించి 4వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇది ఎయిర్పోర్ట్ సిబ్బంది నిబద్ధత, సేవ భావనకు నిదర్శనమని సీఈఓ కదిరి కదిరవన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ స్థాయి వసతులతో, ఆధునిక సౌకర్యాలతో, ప్రతి ఒక్కరు ప్రయాణాన్ని ఎంజాయ్ చేసేలా హైదరాబాద్ విమానాశ్రయం అన్ని రకాల హంగులతో కనిపిస్తుంది.
హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ట్రావెల్ హబ్ గా మార్చటానికి బలం
ప్రయాణికుల సౌకర్యాల పైన ప్రత్యేక దృష్టి సారించి అనేక వసతులను కల్పించింది. తెలంగాణ టూరిజం, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కు కూడా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం ఒక మంచి గుర్తింపు తీసుకువచ్చింది. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ట్రావెల్ హబ్ గా మార్చటంలో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దక్కిన ఈ అరుదైన గుర్తింపు బలాన్ని చేకూరుస్తుంది.
జిఎంఆర్ గ్రూప్ ఈ అరుదైన గుర్తింపుని సాధించటానికి కీలక భూమిక
దీనివలన ప్రయాణికుల సంఖ్య పెరగడంతో పాటు, ఆర్థిక అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. జిఎంఆర్ గ్రూప్ ఈ అరుదైన గుర్తింపుని సాధించటానికి కీలక భూమిక పోషించింది. భవిష్యత్తులో హైదరాబాద్ విమానాశ్రయం మరింత గుర్తింపు సాధించే దిశగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, వసతులు కల్పించడానికి జిఎంఆర్ తగిన ఫోకస్ చేస్తుంది.












Click it and Unblock the Notifications