దిగొచ్చిన లోకేశ్: ఫేస్‌బుక్ నుంచి ఫోటో తొలగింపు, నెగిటివ్ ప్రచారమన్న గాలి
అమరావతి: టీడీపీ శిక్షణ తరగతుల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ వ్యవహరించిన తీరుపట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఆయన దిగొచ్చారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను అవమానించేలా ఉన్న ఫోటోను లోకేశ్ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి తొలగించారు.
వివరాల్లోకి వెళితే... టీడీపీ కార్యకర్తల శిక్షణ తరగతుల్లో భాగంగా లోకేశ్ ముందు చినరాజప్ప నిలబడి మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఫొటో బయటకురావడంపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వయసులో, అనుభవంలో తనకంటే పెద్దవారికి లోకేశ్ ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడటం, నిలదీసినట్లు ప్రశ్నించడంపై సోషల్ మీడియాతో నెటిజన్లు మండిపడ్డారు.

అంతేకాదు పెద్దలను గౌరవించడం లోకేశ్ నేర్చుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆ ఫోటో కింద కామెంట్లు కూడా చేశారు. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో లోకేశ్ ఆ ఫోటోను తన ఫేస్‌బుక్ నుంచి తొలగించారు. మరోవైపు ఈ ఫోటోపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తుందంటూ తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు నేతలు విమర్శించారు.
వైసీపీ నెగిటివ్ ప్రచారం: గాలి ముద్దుకృష్ణమ నాయుడు
డిప్యూటీ సీఎం చినరాజప్ప సూచనలపై జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చర్చిస్తున్న ఫొటోను వైసీపీ నెగెటివ్‌గా ప్రచారం చేస్తోందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పోకడ నచ్చక సీనియర్ నేతలు పారిపోతున్నారని విమర్శించారు.
రైతులకు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుది అని ఆయన కొనియాడారు. హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేశారని, ఇప్పుడు అమరావతి విషయంలో విమర్శలు చేస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా స్విస్ ఛాలెంజ్ అమలు చేశారని ఆయన ఈ సందర్ఫంగా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications