చినరాజప్పకు కోపం వచ్చింది: గీత కులంపై వివాదం
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్పకు కోపమొచ్చింది. తనకు సెక్యూరిటీ అవసరం లేదంటూ ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ఆవరణ నుంచి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోవాలని ఆదేశించారు. మంత్రి వ్యాఖ్యలతో పోలీసులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇటీవల అంబాజీపేట మండలంలో దీపావళి రోజున రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన గొడవలో పోలీసుల తీరు రాజప్పకు నచ్చక కొంత అసహనానికి గురైనట్లు సమాచారం. అమలాపురంలో ఉన్న ఆయనను కలిసేందుకు ప్రొటోకాల్ ప్రకారం కొందరు అధికారులు మంగళవారం వెళ్లారు. ఆ సమయంలోనే రాజప్ప వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
‘మీ సెక్యూరిటీ అవసరం లేదు. మీరూ అవసరం లేదు' అని చినరాజప్ప అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయంపై పోలీసు అధికారులను ప్రశ్నించగా.. చినరాజప్ప స్థానికంగా లేనప్పుడు సెక్యూరిటీ అవసరం లేదని చెప్పారన్నారు.

ఎంపి గీత కులంపై వివాదం
అరకు ఎంపి కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరుగనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అరుకు లోకసభ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపల్లి గీత పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటప్పుడు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించారంటూ ఎన్నికల సమయంలోనే అరకు నుంచి టిడిపి తరపున లోకసభ స్థానానికి పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాణి పిటిషన్ దాఖలు చేశారు.
ఆ కేసులో తదుపరి విచారణను కోర్టు గురువారం చేపట్టనుంది. కాగా, కొత్తపల్లి గీతపై తాను ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం వాస్తవమేనని గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఆమె ఎస్టీ కాదని తాము ఫిర్యాదు చేశామని, కొత్తపల్లి గీత లేదా ఆమె తరపు న్యాయవాది కోర్టుకు గురువారం హాజరుకావాలని నోటీసులు పంపినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications