కౌన్ బనేగా కరోడ్ పతి: టిడిపిపై చిరు ఆగ్రహం, కిరణ్‌పైనా
ఏలూరు: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి పైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆదివారం నిప్పులు చెరిగారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ బలోపేతం కోసం ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చేరుకుంది. ఈ యాత్రలో చిరంజీవి, ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, కేంద్రమంత్రులు పళ్లం రాజు, జెడి శీలం, కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. కొందరు పార్టీ పెడుతూ తనను ఆహ్వానించారని కానీ తాను కాంగ్రెసు పార్టీని విడిచి రానని చెప్పానన్నారు. విభజనకు కిరణ్ కుమార్ రెడ్డియే కారణమని, ఇప్పుడు ఆయన తనను తాను సమైక్యవాదిగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి పూర్వ వైభవం ఖాయమన్నారు. తాను మాట మీద నిలబడే వ్యక్తిని కాబట్టే కాంగ్రెసులో కొనసాగుతున్నానని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ కౌన్ బనేగా కరోడ్ పతిలా అయిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు పార్టీ నుండి చాలామంది నేతలను తీసుకుంటున్నారని, దీంతో టిక్కెట్ల విషయమై కౌన్ బనేగా కరోడ్ పతిలా ఆ పార్టీ పరిస్థితి మారిందన్నారు. ఆ పార్టీలోకి వెళ్లిన వారికి భంగపాటు తప్పదని చిరు అభిప్రాయపడ్డారు.
బిజెపిని మతతత్వ పార్టీ అని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్లీ అదే పార్టీతో పొత్తు కోసం ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయగల సత్తా కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందన్నారు. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెసు పార్టీని తుంగలో తొక్కాలని చూస్తున్న పార్టీల ఆటలు సాగవన్నారు. కష్టాలు వచ్చిన ప్రతిసారి తమ పార్టీ నూతన ఉత్సాహంతో పుంజుకుంటోందన్నారు.
కాంగ్రెసు పార్టీలో పదవులు అనుభవించి కోట్లు దోచుకున్న వారే ఇప్పుడు పార్టీని వీడుతున్నారని రఘువీరా రెడ్డి ఆరోపించారు. జెండా ఎత్తుకొని మోసిన నాయకులు, కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారన్నారు. పార్టీ కష్టకాలంలో ఉందని, ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు అందరు కలిసి రావాలన్నారు.












Click it and Unblock the Notifications