అన్నయ్యకు అడ్వాన్డ్స్ హ్యాపీ బర్త్‌డే: తమ్ముడు పవన్ కల్యాణ్
అమరావతి: ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్త్‌డే సందడి నెలకొంది. లక్షలాది మంది అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి, దీన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నద్ధమౌతోన్నారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ఇప్పుడిప్పుడే క్రియేట్ అవుతున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి పోటెత్తనున్నాయి.
ఇటీవలే విడుదలైన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం చిరంజీవి అభిమానులు నిరాశకు గురి చేసింది. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై దాని ప్రభావం పడకుండా, ఆ ఘోర పరాజయాన్ని మరిచిపోయేలా మెగాస్టార్ పుట్టినరోజును జరుపుకోవాలని భావిస్తోన్నారు అభిమానులు.

ఈ నేపథ్యంలో- జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఒకరోజు ముందే అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. తమ్ముడిగా పుట్టిన అదృష్టాన్ని కలుగజేసినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటోన్నానని చెప్పారు.
సన్నని వాగులా ప్రారంభమైన చిరంజీవి కేరీర్.. ఒక మహానదిలా మారిందని, తాము ఎదగడానికి ఒక మార్గాన్ని చూపిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. లక్షలాది మందికి ఆయన ఎదుగుదల స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. పట్టుదల, శ్రమ, నీతి నిజాయితీ, సేవా భావం.. తనలాంటి ఎందరికో ఆదర్శమని పవన్ కల్యాణ్ అన్నారు.
చెదరని వచ్ఛస్సు, వన్నె తగ్గని అభినయంతో సినీ రంగంలో అప్రతిహతంగా సాగిస్తోన్న విజయాలు అజరామరమైనవని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. కించిత్ గర్వం కూడా లేకుండా తనను తాను మలచుకోగలిగారని ప్రశంసించారు. ఇలాంటి ఎన్నో పుట్టినరోజు పండగలు జరుపుకోవాలని కోరుకుంటోన్నానని అన్నారు.












Click it and Unblock the Notifications