రాజ్యసభలో వెంకయ్య యాక్టర్: ఇటు, అటు టార్గెట్ చిరు
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఇప్పుడు అందరికి లక్ష్యంగా మారారు. రాజ్యసభలో ఆయన మాట్లాడిన తీరుపై ఇరు ప్రాంతాల వారు దుమ్మెత్తి పోస్తున్నారు. సమైక్యవాదిగా చెబుకుంటున్న చిరంజీవి.. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తెలంగాణవాదులు ఎప్పటి నుండో గుర్రుగా ఉన్నారు.
సమైక్యం కోసం గట్టిగా పట్టుబట్టడం లేదని, రాజీనామా చేయడం లేదని, పదవుల కోసం పాకులాడుతున్నారని సమైక్యవాదులు నిప్పులు చెరుగుతున్నారు. గురువారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. దీనిపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లు సమైక్యాంధ్ర కోసం ఏమీ చేయకుండా, కేవలం హైదరాబాదును యూటి చేయాలని ఢిల్లీలో కూర్చున్నారని, ఇప్పుడు అంతా అయిపోయాక మాట్లాడితే ఎవరు నమ్ముతారని విపక్షాలు మండిపడుతున్నాయి. తాను సమైక్యవాదినని చెప్పిన చిరంజీవి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబితే దానికి అర్థమేముంటుందంటున్నారు.

చిరంజీవిపై బిజెపి నేత వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. చిరంజీవి మంచి నటుడు అని వెంకయ్య సభలో అన్నారు. అయితే, తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దని, ఎపిలో మంచి నటుడు అని చెప్పానని వెంకయ్య వివరణ ఇచ్చారు.
చిరు మాట్లాడుతుంటే అరుణ్ జైట్లీ కూడా ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నారా లేక వ్యక్తిగా మాట్లాడుతున్నారా చెప్పాలని ప్రశ్నించారు. తాను ప్రజల వాడిగా మాట్లాడుతున్నానని చిరు సమాధానమిచ్చారు. రాజకీయ భవిష్యత్తు కోసమే చిరంజీవి సమైక్యమంటూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారంటున్నారు.
కాగా, చిరంజీవికి వెంకయ్య బాగా చురకలు అంటించిన విషయం తెలిసిందే. 'చిరంజీవి మంచి నటుడు' అని తనదైన శైలిలో అన్నారు. ఆ వెంటనే 'సభలో కాదు. రాష్ట్రంలో ఆయన మంచి ప్రజాదరణ ఉన్న నటుడు' అని వెంకయ్య నొక్కి చెప్పారు. అప్పటిదాకా ఆంగ్లంలో రాసుకున్న ప్రసంగాన్ని చదివిన చిరంజీవి... వెంకయ్య వ్యాఖ్యలపై తెలుగులో స్పందించారు. 'నేను తెరమీద మంచి నటుడిని అని చెప్పారు. ఇది నాకు ఇచ్చిన సర్టిఫికెట్‌గా భావిస్తున్నాను' అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications