సీమాంధ్రలో చిరంజీవిVsపవన్, ఫ్యాన్స్ అయోమయం
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికలలో... ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో చిరంజీవి వర్సెస్ పవన్ కళ్యాణ్‌గా మారుతోంది. చిరంజీవి సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రచార సారథిగా ఉండగా... పవన్ కళ్యాణ్ బాహాటంగా గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఓటేయాలని ప్రజలకు సూచించారు. దీంతో సీమాంధ్రలో బిజెపి వర్సెస్ కాంగ్రెస్‌గా కాకుండా.. చిరు వర్సెస్ పవన్‌లా కనిపిస్తోంది.
అయితే, మెగా సోదరుల మధ్య నడుస్తున్న రాజకీయ సమరంలో అభిమానులు నలిగిపోతున్నారు. చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తరఫున ప్రచారభారాన్ని భుజానికెత్తుకుని యాత్రలు చేస్తుంటే.. పవన్ కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పరమ శత్రువుగా భావిస్తున్న మోడీ జపం చేస్తున్నారు. దీంతో మెగాస్టార్‌కూ, పవర్ స్టార్‌కూ జమిలిగా వీరాభిమానులైన వారిలో ఇప్పుడు అయోమయం నెలకొంది.
చిరంజీవి తర్వాత సినిమాల్లో అంతటి స్థాయిని అందుకున్న హీరోగా పవన్‌ను మెగా ఫ్యాన్స్ ఆరాధిస్తున్నారు. ఆయన చరిష్మా ఏ స్థాయికి ఎదిగిందంటే మెగా క్యాంప్‌లోని ఏ హీరో సినిమా ఫంక్షన్ జరిగినా, ఆ ఫంక్షన్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణే. ఆఖరుకి పవన్ కల్యాణ్ గైర్హాజరై, చిరంజీవి హాజరైన వేడుకల్లో సైతం 'వుయ్ వాంట్ పవర్ స్టార్' అంటూ అభిమానులు గోలచేయడం పరిపాటిగా మారింది.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పట్నించీ అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయనీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీని ఎలా అదే పార్టీలో కలుపుతారంటూ అన్నయ్యను పవన్ నిలదీశారనీ వార్తలు కూడా వచ్చాయి. అప్పుడప్పుడూ వీటిని స్వయంగా చిరంజీవి లేదా పవన్ ఖండించినా, తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని ప్రకటించినా, ఈ ప్రచారం ఆగకపోవడం గమనార్హం.
ఇటీవల నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభోత్సవంలో చిరంజీవిని పవన్ పట్టించుకోనట్లు వ్యవహరించడం ఈ ప్రచారానికి మరింత తోడ్పాటునిచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ జనసేనను స్థాపించడం చిరంజీవి క్యాంప్‌కు మింగుడు పడలేదు. అన్నయ్య ఆధారంగానే తాము చిత్రసీమలో పేరు సంపాదించుకున్నామంటూ నాగబాబు తన మద్దతును చిరంజీవికే ప్రకటించారు. రామ్‌చరణ్ సైతం తండ్రి పక్షానే నిలిచారు.
అయితే జనసేన పార్టీ ఆవిర్భావాన్ని పవన్ ప్రకటించిన రోజు నుంచీ మెగా అభిమానులు సైతం రెండు వర్గాలుగా విడిపోయారనీ, వారిలో యువతరం పవన్‌కి జై కొడుతున్నారనీ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా గురువారం తన పుట్టినరోజును అభిమానుల మధ్య జరుపుకొన్న రామ్‌చరణ్ మీడియా సమావేశం పెడుతున్నట్లు పత్రికలవారికి సమాచారం అందించారు. ఈ సమావేశంలో ఆయన రాజకీయాల గురించీ, పవన్ బాబాయ్ గురించీ మాట్లాడతారని వినిపించింది. కానీ చిరంజీవి సలహా మేరకు చెర్రీ చివరి నిమిషంలో ఆ సమావేశాన్నే రద్దు చేసుకున్నారట.












Click it and Unblock the Notifications