చిరంజీవి, మరో ఇద్దరి రాజీనామా నిజమే: కావూరి నో
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులు మాత్రమే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజీనామా లేఖలు మాత్రమే ప్రధానికి కార్యాలయానికి చేరాయి. మిగతావారి రాజీనామాలు అక్కడికి చేరలేదని సమాచారం. కావూరి సాంబశివ రావు, పళ్లంరాజు కూడా రాజీనామాలు చేసినట్లు ప్రచారం సాగింది.
కావూరి సాంబశివ రావు, పళ్లం రాజుల రాజీనామాలు ప్రధాని కార్యాలయానికి చేరలేదని తెలుస్తోంది. వారు రాజీనామా చేశారా లేదా అనేది కూడా అనుమానంగానే ఉందంటున్నారు. తెలంగాణ నోట్ కేంద్ర మంత్రి వర్గం ఆమోదం పొందినప్పటి నుంచీ కావూరి సాంబశివరావు మీడియాకు దూరంగా ఉంటున్నారు. పళ్లం రాజు శుక్రవారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలవడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.

కిల్లి కృపారాణి కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని అంటున్నారు. పనబాక లక్ష్మి తాను రాజీనామా చేయబోనని కచ్చితంగానే చెప్పారు. రాయలసీమకు చెందిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రధానిని కలిసి తన రాజీనామా లేఖను అందించారు. తన ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, కాంగ్రెసు పార్టీలో కొనసాగుతానని చెప్పారు.
దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా ప్రధాని కార్యాలయానికి పంపించారు. తాను రాజీనామా విషయంలో వెనక్కి తగ్గబోనని పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి కచ్చితంగానే చెప్పారు.












Click it and Unblock the Notifications