బాబు సర్కార్‌కు చిక్కులు: ఎన్‌కౌంటర్‌పై హత్య కింద కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో 20 మంది ఎన్‌కౌంటర్‌పై హత్య కింద కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చిక్కులు తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు. అసహజ మరణాలను భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద ఎందుకు నమోదు చేయడం లేదని హైకోర్టు అడిగింది.
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలతో నివేదికను ఇవ్వాలని ఏపీ డీజీపీ రాముడును హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం శేషాచలం ఘటనపై ఏపీ పోలీసులు కోర్టుకు నివేదిక అందజేశారు.
అయితే అది స్పష్టంగా లేదని మరో నివేదిక ఇవ్వాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులిచ్చిందని, మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఆత్మరక్షణలో భాగంగానే తాము ఎదురు కాల్పులు జరిపామని, ఎదురు కాల్పుల్లోనే 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది.
ఇదిలావుంటే, శేషాచలం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ల రీపోస్టుమార్టంకు ఆదేశించడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో 20 మంది మరణించారు. వారిలో ఆరుగురి మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పందించింది.
కాల్పుల్లో మరణించిన శశికుమార్ అనే వ్యక్తి భార్య మునమ్మాల్ ఆ పిటిషన్‌ను దాఖలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం సైతం రీపోస్టుమార్టంకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. అయితే తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆరుగురి మృతదేహాలను భద్రపరచాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications