కనకవర్షం కురిపించే ఎంఎఫ్ లను ఇలా ఎంపిక చేయండి
ఉదాహరణకు ఒక ఏడాది, లేదా రెండేళ్ల వరకు మాత్రమే మదుపు చేయగలమనుకుంటే డెట్ ఫండ్లు అనువుగా ఉంటాయి.
ప్రతి ఒక్కరూ తాము పెట్టే పెట్టుబడులు శరవేగంగా అభివృద్ధి చెందిన సాధ్యమైనంత త్వరగా మంచి రాబడి ఇవ్వాలని కోరుకుంటుంటారు. అలాగే మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయాలని చాలామంది భావిస్తారు. అయితే మన లక్ష్యానికి అనుగుణంగా ప్రతిఫలం ఇచ్చే మ్యూచువల్ ఫండ్ ను ఎంపిక చేసుకోవడం ఎలా? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం..

లక్ష్యానికి అనుగుణంగా..
మంచి మ్యూచువల్ ఫండ్ , చెడు మ్యూచివల్ ఫండ్ అంటూ ఏమీ ఉండవు. ఈరోజు మంచి ప్రతిఫలం ఇచ్చే ఫండ్ సంవత్సరం తర్వాత అంత ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు. ఒకప్పుడు ప్రతిఫలం ఇవ్వలేనిది లాభాలను పండించవచ్చు.. ఒకరి లక్ష్యానికి సరిపోయిన మ్యూచువల్ ఫండ్ మరొకరికి రాబడిని ఇవ్వలేకపోవచ్చు. ఎంఎఫ్(మ్యూచువల్ ఫండ్) నిర్ణయించుకున్నప్పుడు అసలు మీ లక్ష్యం ఏమిటనేదానిపై ఒక స్పష్టత ఉండాలి. పిల్లల విద్యాభ్యాసం, వారి వివాహం, పదవీ విరమణ ఇలా ఒక నిర్ధిష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. అందుకు ఎంత అవసరమవుతుందో అంచనా ఉండాలి. అంత మొత్తంలో రాబడి రావాలంటే ఎలాంటి ఫండ్ ను ఎంచుకోవాలనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు మీరు మదుపు చేస్తారో ముందే నిర్ణయించుకోవడంతోపాటు నష్టభయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

అనువుగా డెట్ ఫండ్లు..
ఉదాహరణకు ఒక ఏడాది, లేదా రెండేళ్ల వరకు మాత్రమే మదుపు చేయగలమనుకుంటే డెట్ ఫండ్లు అనువుగా ఉంటాయి. స్వల్పకాలిక లక్ష్యాల కోసం స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్లను ఎంచుకోవడంవల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కనీసం ఏడు సంవత్సరాలు మదుపు చేయగలుగుతామనుకుంటేనే స్మాల్ మిడ్ క్యాప్ ఫండ్లను ఎంచుకోవాలి. మూడు నుంచి 5 సంవత్సరాల వరకే ఎంఎఫ్ లో మదుపు చేయాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇలా మీ లక్ష్యానికి అనుగుణంగా ఫండ్ ను ఎంచుకోవాలి.

ఫండ్ గత చరిత్ర..
మ్యూచువల్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల్లో ఇది కూడా ఒకటి. అయితే, ముందు చెప్పినట్లుగా ఫండ్ చరిత్ర భవిష్యత్ పనితీరును నిర్ణయించవచ్చు.. నిర్ణయించకపోవచ్చు కానీ, ఒక అవగాహనకు రావడానికి అయితే ఉపయోగపడుతుంది. డౌన్‌సైడ్ ప్రొటెక్షన్ ఎంత వరకు ఉందో తెలుసుకోవచ్చు.

స్థిరత్వం..
ప్రస్తుతం ఒక ఫండ్ మంచి లాభాలనిస్తున్నప్పటికీ అది గతంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండొచ్చు. అంతేకాదు.. ఫండ్ పనితీరులో హెచ్చుతగ్గులుపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్థిరత్వం లేనివాటిని ఎంచుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మెలగాలి. ఫండ్ మేనేజర్ ద్వారా మదుపు చేయాలనుకుంటే ఆ మేనేజర్ గత పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి. లాభం ఇవ్వని మేనేజర్లకు దూరంగా ఉండటమే మంచిది. ఎంఎఫ్ నిర్వహణలో ఆస్తుల మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. స్కీమ్ ను ఎంతమంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారో సూచిస్తుంది. ఈక్విటీ ఫండ్లలో ముఖ్యంగా స్మాల్ క్యాప్ ఫండ్లలో ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి, వేటి నుంచి నిష్క్రమించాలో నిర్ణయించుకోవడం క్లిష్టంగా మారుతుంది. అదే లిక్విడ్, షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్లలో అయితే ఏయూఎం ఎక్కువగా ఉంటే రీడెమ్షన్స్ రిస్క్ ఉండదు. ఫండ్ నిర్వహణ, ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ వంటి వాటికి తీసుకునే ఫీజునే ఎక్స్‌పెన్స్ రేషియో అంటారు. ఒక ఫండ్‌ను రన్ చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉండే ఎంఎఫ్ లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనం పెట్టే పెట్టుబడిపై వచ్చే లాభం ఆదాయపు పన్నుశాఖ పరిధిలోకి వస్తాయి. ఎంఎఫ్ లపై వచ్చే లాభాలపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్లలో క్యాపిటల్ గెయిన్స్ పై ఇండెక్సేషన్ ఉపయోగం ఉంటుంది.












Click it and Unblock the Notifications