భూమనకు మళ్లీ సీఐడీ నోటీసులు: ఈసారైనా అరెస్ట్ చేస్తారా?
అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన తుని విధ్వంస ఘటన కేసుకు సంబంధించి వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తుని ఘటనకు సంబంధించి ఈ నెల 19వ తేదీన గుంటూరులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
నన్ను అరెస్ట్ చేస్తారేమో.. సిద్ధం: భూమన, కాదని మండిపడ్డ అంబటి భూమనతో పాటు కాకినాడలో ఉంటున్న ఆయన సన్నిహితుడు మెహర్‌కు కూడా సీఐడీ నోటీసులు జారీ చేయడం విశేషం. వీరితో పాటు గతంలో విచారణకు హాజరుకాని నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడికి కూడా మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది.

కాగా ఈ కేసుకు సంబంధించి ఈ నెల 6,7 తేదీల్లో భూమనను సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు రెండు రోజుల పాటు ఆయన్ను సుమారు పదహారు గంటలకు పైగా సీఐడీ అధికారులు విచారించారు.
రెండో విచారణకు హాజరయ్యే క్రమంలో ఆయన తనను అరెస్ట్ చేస్తారేమో అని ఆయన అనుమానం కూడా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే సీఐడీ అధికారులు ఆయన్ను విచారించి వదిలేసిన సంగతి తెలిసిందే.
నన్ను అరెస్ట్ చేస్తారేమో.. సిద్ధం: భూమన, కాదని మండిపడ్డ అంబటి మళ్లీ తిరిగి విచారణకు హాజరు కావాల్సిందిగా భూమనకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. దీంతో ఈనెల 19న ఉదయం 10 గంటలకు గుంటూరు సీఐడీ విచారణాధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ నోటీసులపై భూమన ఇంకా స్పందించలేదు.
ఇక ఈ ఏడాది జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.
భూమనను ఇరికించేందుకు కుట్ర: అంబటి
తుని ఘటనలో భూమన కరుణాకర్‌రెడ్డిని ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైసీపీ నేత ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరెస్టులు, బెదిరింపులతో కాపు ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.
కాపులను ఆరు నెలల్లో బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు రెండున్నర ఏళ్లు అయినా, కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తుని ఘటనలో భూమనకు సంబంధమేంటని ఆన ప్రశ్నించారు. కాపునేత ముద్రగడ పద్మనాభంను భూమన కలిసి ఉద్యమానికి మద్దతు తెలిపినంత మాత్రాన కేసులు పెడతారా? అని అంబటి ప్రశ్నించారు.
ఈ కేసులో ఇరికించాలనే భూమనకు మరోసారి నోటీసులు ఇచ్చారని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు వైసీపీ నేతలు భయపడరని ఆయన చెప్పారు. ముందుగా నేతలపై కేసులు పెడతారని కేసులకు లొంగకపోతే చంద్రబాబు డబ్బులు ఇస్తారని అన్నారు. అందితే జట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం బాబు నైజమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications