ధైర్యముంటే రండి!...రైలు పట్టాలపై కూర్చుందాం:శివాజీ

గుంటూరు:"ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ రాష్ట్రంలో బస్సులు ఆపటం కాదు...ధైర్యం ఉంటే రండి...రైల్వే ట్రాక్‌లపై కూర్చుందాం...కేంద్ర సంస్థల కార్యకలాపాలు ఆపుదాం"...అని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు సినీ నటుడు శివాజీ సవాలు విసిరారు.
'మేధావుల మౌనం - సమాజానికి శాపం' అనే అంశంపై ఆదివారం గుంటూరు లో కమ్మజనసేవా సమితి బాలికల వసతిగృహ సముదాయంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వివిధ సంఘాలు, పార్టీల ప్రతినిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి గాను ఆంధ్రా ప్రజలు బిజెపిపై తమ ఆక్రోశం చూపబోతున్నారని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని సినీ నటుడు శివాజీ జోస్యం చేప్పారు.

సోషల్ మీడియా...రాజకీయాలు
ప్రజలను కులాల పేరుతో విభజించి రాష్ట్రంలో అవాంఛిత పరిస్థితిని నెలకొల్పటానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని...జాగ్రత్తంటూ హెచ్చరించారు.
అందుకు నిదర్శనంగా ఇటీవలికాలంలో రామాయణంపై వ్యాఖ్యలు, అమరావతిపై పుస్తకాలు, రాజధానిలో దీక్షలు పుట్టుకొస్తున్నాయని...ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో రాజకీయాలు ఎక్కువైయ్యాయని, కుల మేధావులని ప్రచారం చేస్తుంటే చాలా బాధేస్తుందని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. మేథావులు మౌనంగా ఉండటం లేదని, మేథావులు మాట్లాడబట్టే రాజకీయనాయకులు సక్రమంగా పని చేస్తున్నారని శివాజీ అభిప్రాయపడ్డారు.

మోడీ పర్యటనలు..తెచ్చిందెంత?
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవటం సరికాదని, ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించుకోవాలని అన్నారు. ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనలతో దేశానికి తెచ్చిన కంపెనీలు ఎన్ని?...వచ్చిన పెట్టుబడులు ఎంత?...అని ప్రశ్నించారు. తిరుపతిలో యూనిట్ పెట్టేందుకు ప్రముఖ సంస్థ యాపిల్ ముందుకొచ్చింది. వారి ప్రతినిధులు ప్రధానిని కలవటానికి వెళ్లారు. వారిపై ఒత్తిడి తెచ్చి ప్రధాని మోడీ దానిని మహరాష్ట్రకు తరలించారు. ఈ విషయం వాస్తవం కాదా?...అని శివాజీ నిలదీశారు.

ద్రోహానికి ట్రేడ్ మార్క్...కేంద్రం
అనంతరం ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి బాకాలు ఊదుతూ గుంటూరులో, రాజమండ్రిలో తిరుగుతున్న నేతలను నిలదీద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. నయవంచనకు, నమ్మక ద్రోహానికి కేంద్రం ట్రేడ్ మార్కుగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, రాజకీయ విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ, నన్నయ్య వర్సిటీ మాజీ వీసీ విక్టర్ పాల్, సీనియర్ పాత్రికేయులు బాలకోటయ్య, ధార్మిక మండలి అధ్యక్షురాలు సత్యవాణి పాల్గొన్నారు.

హోదాతోనే అభివృద్ది:లగడపాటి
ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. అనంతపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కావాలని ఆత్మహత్యలు చేసుకోవడం మంచిది కాదని...ఏదైనా పోరాడి సాధించుకోవాలన్నారు. రాజకీయ కారణాలతో ప్రత్యేక హోదా వస్తుందే తప్ప...ఆత్మహత్యలతో రాదన్నారు. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలనే వాదన, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు ప్రజల్లో బలమైన ఆకాంక్షగా నాటుకుపోయాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మాటలతో కాకుండా ఓటుతో బదులు చెబుతారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పై కోపతాపాలను బ్యాలెట్‌పై వందశాతం చూపించారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!