బక్రీద్ వేళ ఊహించని షాక్! మేకలకు జ్వరం, విరేచనాలు..
దేశవ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వేడిగాలులు కేవలం మనుషులనే కాదు.. మూగజీవాలను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ముస్లింల పవిత్ర పండుగ 'ఈద్ అల్-అధా' (బక్రీద్) సమీపిస్తున్న తరుణంలో, ఉత్తర ప్రదేశ్‌లో విచిత్రమైన సంక్షోభం తలెత్తింది. పండుగ నాటి 'ఖుర్బానీ' (బలిదానం) కోసం ఎంతో అపురూపంగా, ఆరోగ్యంగా పెంచిన మేకలు.. ఈ వడగాల్పుల తీవ్రతకు అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతున్నాయి. నిన్నటివరకు కళకళలాడిన జీవాలు ఒక్కసారిగా నీరసించిపోతుండటంతో పశుపోషకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
స్థానిక పశుపోషకుడు మొహమ్మద్ ఖాదిర్ తన ఆవేదనను పంచుకుంటూ.. ఎండల తీవ్రత వల్ల తన మేకకు తీవ్రమైన జ్వరం వచ్చిందని, అది కాస్తా ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేసిందని తెలిపారు. "నా మేకకు వేడి దెబ్బ తగిలి జ్వరం వచ్చింది, ఏమీ తినడం లేదు. దాన్ని చూస్తుంటే చాలా కష్టంగా ఉంది" అని ఆయన ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో వాపోయారు. మరో పశుపోషకుడు మొహమ్మద్ రౌఫ్ మాట్లాడుతూ, అధిక వేడి కారణంగా తన మేకకు నిన్నటి నుండి తీవ్రమైన విరేచనాలు అవుతున్నాయని చెప్పారు. దీనికి తోడు మార్కెట్లో కొందరు వ్యాపారులు మేకల బరువు ఎక్కువగా చూపించి లాభపడటానికి వాటి కడుపు నిండా నీటిని బలవంతంగా నింపుతారని, ఈ వేసవిలో ఆ చర్యల వల్ల మూగజీవాలు మరింత ఇబ్బంది పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

పశువైద్య శాలలకు క్యూ
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల జంతువులు తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్, విరేచనాలు వంటి వేడి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నాయని పశువైద్యాధికారి వికాస్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వస్తున్న కేసులలో మేకల సంఖ్యే చాలా ఎక్కువగా ఉందన్నారు. అనారోగ్యంతో వస్తున్న మేకలను కాపాడేందుకు అత్యవసర చికిత్సలో భాగంగా వీటికి ఇంట్రావీనస్ డ్రిప్స్ (సలైన్ ఎక్కించడం), యాంటీబయాటిక్స్, అనాల్జెసిక్స్ (నొప్పి నివారణ మందులు) ఇస్తున్నట్లు ఆయన వివరించారు.
'ఖుర్బానీ'కి ఆరోగ్యమే ముఖ్యం
ఇస్లామిక్ సంప్రదాయంలో ఈద్ అల్-అధాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త ఇబ్రహీం దేవుని పట్ల చూపిన అపారమైన విధేయతకు ప్రతీకగా జరుపుకునే ఈ 'బలిదాన పండుగ'లో ప్రధాన ఘట్టం 'ఖుర్బానీ'. ఇందులో భాగంగా పూర్తిగా ఆరోగ్యంగా, ఎలాంటి లోపాలు లేని పశువులను (గొర్రెలు, మేకలు, ఆవులు) మాత్రమే బలి ఇస్తారు. అనంతరం ఆ మాంసాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, పేదలకు పంచుతారు. అయితే, పండుగ సమయానికి మేకలు అనారోగ్యం పాలైతే వాటిని ఖుర్బానీకి ఉపయోగించడం కుదరదు కాబట్టి, పెంపకందారులు వేల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.
వైద్యుల కీలక సూచనలు.. ఇంకా పెరగనున్న ఎండలు
మూగజీవాలను వేడి దెబ్బ నుండి రక్షించుకోవడానికి పశుపోషకులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ వికాస్ కుమార్ సూచించారు. మేకలకు నిరంతరం తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఎక్కువసేపు వాటిని ఎండలో ఉంచకూడదని చెప్పారు. మధ్యాహ్న సమయాల్లో వాటిని బయటకు తీసుకెళ్లడం పూర్తిగా మానుకోవాలన్నారు. ఇదిలావుండగా, ఉత్తర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో తీవ్రమైన వేడిగాలులు (Heatwaves) మరింత కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించడం పశుపోషకులను మరింత కలవరపెడుతోంది.














Click it and Unblock the Notifications