అధికారులు చంద్రబాబుకు వాస్తవాలు చెప్పాలి, మోదీ అంగీకరించరు - పవన్ ఆగ్రహం..!!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారులు సీఎం చంద్రబాబుకు వాస్తవాలు చెప్పాలని వ్యాఖ్యానించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. గోదావరి జిల్లాల్లో ఆశించిన రీతిలో పుష్కరాల పనులు జరగడం లేదని..ఇప్పటివరకు పనులకు డీపీఆర్‌లు, ప్రణాళికలు పూర్తిస్థాయిలో లేకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏడాదిలోనే పుష్కరాల పనులన్నీ ఎలా పూర్తి చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం పై కేబినెట్ లో చర్చిస్తామని స్పష్టం చేసారు.
గోదావరి పుష్కరాల సన్నద్దత పైన డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారులు సీఎం చంద్రబాబుకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. గోదావరి పుష్కరాలకు సన్నద్ధత లేకపోవడంపై క్యాబినెట్లో చర్చిస్తామని చెప్పారు. హడావుడిగా కూలిపోయే పనులు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రణాళిక లేకుండా అడిగితే .. ప్రధాని మోదీ నిధులు ఇవ్వరని పవన్ చెప్పుకొచ్చారు. నాసిరకం పనులతో ప్రజల ప్రాణాలకు ప్రమాదమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాలుష్యరహిత గోదావరి పుష్కరాలు నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గోదావరి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి తీర కాలుష్యాన్ని, పుష్కర పనులను స్వయంగా పరిశీలించిన పవన్ కీలక సూచనలు చేసారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను 'కాలుష్యరహిత గోదావరి' థీమ్ తో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.

అధికారులకు కీలక దిశా నిర్దేశం
పుష్కరాల్లో చేయాల్సిన పనుల తీరు, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికను స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయనేది, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నది అధికారులు వివరించారు. చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం మురుగునీరు గోదావరిలోకి కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. నది తీరంలో జరుగుతున్న కాలుష్యం తీరును స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బందితో మాట్లాడి వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని చూశారు. గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడే, గోదావరి నది తీరాన్ని కాపాడే మంచి పనులకు ఉపయోగించుకోవాలి. మొదట కాలుష్యకారక అంశాలపై పూర్తిస్థాయి ఆడిట్ జరగాలి.. తర్వాత దానిని ఎలా అధిగమించాలి అనే అంశాల పట్ల దృష్టి సారించవచ్చని పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications