నీట్ పేపర్ లీక్ పై సుప్రీం కీలక ఆదేశాలు..! ఎన్టీఏకు అక్షింతలు..!
ఈ ఏడాది వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష (NEET UG 2026) పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో గతంలో తలెత్తిన వివాదాల సందర్భంగా సిఫార్సు చేసిన సంస్కరణల అమలుపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి సూటి ప్రశ్నలు వేసింది. ఈ మేరకు నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే వారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ల కాపీలను సొలిసిటర్ జనరల్‌కు సమర్పించాలని ఆదేశించింది.
నీట్ పేపర్ లీక్ పై దాఖలైన పిటిషన్లపై విచారణలో పిటిషనర్ల తరఫున హాజరైన లాయర్ తన్వి దూబే.. ఈ కేసు ప్రాధాన్యతను సుప్రీంకోర్టుకు గుర్తుచేశారు. వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్షకు సుమారు 23 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఇది వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆమె కోర్టుకు తెలిపారు. కాబట్టి ఈ పిటిషన్ పై విచారణ త్వరితగతిన చేపట్టాలని, విచారణకు త్వరగా తేదీని కేటాయించాలని దూబే కోర్టును కోరారు. అయితే కోర్టు ప్రస్తుత వివాదానికి మించి, పరీక్షా ప్రక్రియలకు సంబంధించిన గత ఆందోళనల తర్వాత ప్రవేశపెట్టిన గత సంస్కరణ చర్యల అమలుపై దృష్టి సారించింది. ఈ మేరకు వారు గుణపాఠాలు నేర్చుకోలేదని ఆక్షేపించింది.

గతంలో ఏర్పాటు చేసిన పర్యవేక్షణ, సంస్కరణల యంత్రాంగాలను కోర్టు ప్రస్తావిస్తూ.. వాటి అమలు విషయంలో ఎన్టీఏ జవాబుదారీతనం కోరింది.మూడు రోజుల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎన్‌టీఏకు ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 14న ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ స్థితిని వివరిస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు తన ఆదేశాలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. పరీక్షల భద్రతను పటిష్టం చేయడానికి గతంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను పాటించేలా తీసుకున్న చర్యలను రికార్డులో ఉంచాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ఈ రెండు అఫిడవిట్లను మూడు రోజుల్లోగా దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాత ఈ విషయం తిరిగి విచారణ జరగనుంది.














Click it and Unblock the Notifications