నా కష్టంలో అండగా నిలిచారు- నిందలను ఆపాదిస్తున్నారు : జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు..!!
ఏపీలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పర్యటన ముగిసింది. పలు సమావేశాల్లో ఆయన బిజీగా గడిపారు. ఇక, పర్యటనలో భాగంగా.. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజేఐ సన్మాన కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో సీజేఐ పలు అంశాలను ప్రస్తావించారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అనేక బార్ అసోషియేషన్లు, బార్ కౌన్సిళ్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తన తరఫున నిలిచాయని చెప్పుకొచ్చారు. వారి అండదండలు, మద్దతు, సహకారంతోనే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాననే విషయాన్ని ఎన్నడూ మరువలేనన్నారు.

కీర్తి ..గౌరవం కాపాడుకోవాలి
ఇది వరకు పటిష్ఠమైన న్యాయవాద సంఘాలు ఉండేవి. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను కించపరిస్తే సహించేవారు కాదు. ఇప్పుడు ఆ చైతన్యం తగ్గింది. న్యాయవ్యవస్థకు, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. అన్ని వ్యవస్థలు పని చేయకపోతే చివరికి న్యాయ వ్యవస్థే కాపాడాలన్నారు. దాన్ని రక్షించుకుని దాని కీర్తి, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉంది. న్యాయమూర్తులూ న్యాయవాదులను గౌరవించాలని పేర్కొన్నారు. వారి వాదనల్ని అర్థం చేసుకోవాలి. న్యాయమూర్తులు, న్యాయవాదులు సామరస్యపూర్వకంగా ఉంటేనే న్యాయవ్యవస్థకు గౌరవం పెరుగుతుందని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు.

న్యాయమూర్తులపై దాడులు పెరిగాయి
న్యాయమూర్తులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగాయని, న్యాయాధికారులపై భౌతిక దాడులు నమోదవుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా వీటిని పలుసార్లు ప్రస్తావించాను. కక్షిదారులకు అనుకూలంగా తీర్పులు వెలువడకపోతే జడ్జిలపై ఓ ప్రణాళిక ప్రకారం విష ప్రచారం చేస్తున్నారంటూ మరో కార్యక్రమంలో సీజేఐ చెప్పుకొచ్చారు. వీటిని దర్యాప్తు సంస్థలు సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకుని, ఆదేశించే వరకు అధికారులు దర్యాప్తునకు పూనుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు సహకరించాలి
ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయమూర్తులు, న్యాయాధికారులు నిర్భయంగా విధులు నిర్వహించేలా తోడ్పాటు అందించాలని సీజేఐ కోరారు. తాను జూనియర్ న్యాయవాదిగా బెజవాడలో ప్రాక్టీస్ చేసే రోజుల్లో కృష్ణా జిల్లాలోనే కాకుండా, రాష్ట్రంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా మొట్టమొదట బెజవాడ బార్ అసోసియేషనే స్పందించేదని సీజేఐ గుర్తు చేసుకున్నారు. విజయవాడ న్యాయస్థానం భవనాన్ని ప్రారంభించేందుకు మళ్లీ విజయవాడ వచ్చే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.

ఢక్కామొక్కీలు తిని.. ఈ స్థాయికి
పేదవాడికీ న్యాయం జరగడానికి న్యాయవాదులు కొంత సమయం ఉచిత న్యాయసేవకు కేటాయించాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. న్యాయవాదిగా బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యుడిగానే తొలి అడుగులు వేశానని గుర్తు చేసుకున్నారు. బెజవాడ గాలి పీల్చి, కృష్ణా నది నీళ్లు తాగి, ఇక్కడే తిరిగి, ఇక్కడే పెరిగి, ఈ బెజవాడ ఇచ్చిన ధైర్యం, ఆత్మ విశ్వాసంతో జీవితంలో అనేక ఢక్కామొక్కీలు తిని, ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. ఈ రోజు అందరి ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడగలిగే శక్తి బెజవాడ బార్ అసోసియేషనే తనకు ఇచ్చిందని సీజేఐ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications