పవన్ కు జగన్ కౌంటర్! : సాక్షి కథనంతో ఆ విషయం తేలిపోయింది!? (ఫోటోలు)
కాకినాడ :

లైన్ మిస్ అయిన వపన్ :
ఆవేశంతో కూడిన ప్రసంగం.. కానీ ఆలోచనే మిస్ అయిందా..? పవన్ అసలు లైన్ మిస్ అయిపోయి.. చచ్చిన పామునే మళ్లీ మళ్లీ చంపినట్లు కాంగ్రెస్ మీదే పడ్డారు తప్పించి, అటు ప్రధాని మోడీని గానీ, ఇటు సీఎం చంద్రబాబును గానీ పల్లెత్తు మాట అనలేదు. వెంకయ్య నాయుడును టార్గెట్ చేయడం, అవంతి శ్రీనివాస్ ను రాజీనామా చేయమనడం తప్పించి.. టీడీపీ కేంద్రమంత్రులను గానీ, మరే ఇతర జాతీయ స్థాయి నేతలను గానీ పవన్ గట్టిగా నిలదీయకపోవడం గమనార్హం.

పవన్ వర్సెస్ వైసీపీ
అధికార పార్టీపై, ప్రతిపక్ష పార్టీపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో పవన్ తెరపైకి రావడంతో.. హోదాను సాధించగలిగే సత్తా ఆయనలో ఉందనుకున్న ఏపీ ప్రజానీకానికి నిన్నటి సభ నిరాశపరిచిందనే చెప్పాలి. అయితే ఇక్కడే ఇంకొక ఆసక్తికర విషయాన్ని గమనించాల్సి ఉంది. హోదాపై ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే పోరాటం చేస్తుండగా.. అదే హోదాపై పోరాడుతానంటూ పవన్ తెరపైకి రావడంతో.. వైసీపీలోను కాస్త గుబులు రేగినట్లుగా తెలుస్తోంది.

పవన్ స్పీచ్ వైసీపీకి కలిసొచ్చిందా?
కాకినాడ సభ తర్వాత.. నేటి సాక్షి కథనంలోను ఆ విషయం తేటతెల్లమైంది. ఒకవిధంగా పవన్ తన గందరగోళ ప్రసంగంతో మునుపటి లాగే ఎలాంటి స్పష్టత లేకుండా మాట్లాడేయడంతో.. పవన్ వైసీపీకి ఇక పోటీ కాడు అనే నిర్ణయానికి ఆ పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ఈరోజు సాక్షిలోను కథనం వెలువడింది.

సాక్షి కథనం ఏం చెప్పింది?
సాక్షి కథనం ప్రకారం.. హోదాపై పోరాడాలనుకున్న ఏపీ ప్రజలంతా ఇప్పుడో గందరగోళ స్థితిలో పడ్డారు. ఓవైపు బంద్ కు వ్యతిరేకం కాదంటూనే, ప్రజా ప్రతినిధులు ఉండగా మనమెందుకు పోరాడాలన్న పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు వారిని ఎటూ పాలుపోని స్థితిలో నిలుచోబెట్టాయి. ఇక హోదాకు ఇవ్వనన్న జైట్లీని మాట కూడా ఎత్తకుండా.. ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు ప్రస్తావనే లేకుండా, పాచిపోయిన లడ్డూలను తీసుకుంటారా లేదో తేల్చుకోవాలంటూ ప్రశ్నించడం.. విశ్లేషకులకు సైతం ఆశ్చర్యపరిచిందన్నది ఆ కథనం సారాంశం.

పవన్ స్పీచ్ అంతా అయోమయమే!
ఇక హోదా కోసం పోరుబాట పట్టకుండా ఓవైపు పరోక్షంగా యువతకు కళ్లెం వేస్తూనే.. పోరాడితే పోయేదేం లేదని ఆవేశంగా ప్రసంగాలు వల్లె వేయడం దేనికి నిదర్శనం అని ఆ కథనం ద్వారా పవన్ ను గట్టిగానే నిలదీశారు. హోదాపై అభ్యంతరం తెలుపుతున్నది దక్షిణాది రాష్ట్రాలైతే.. పవన్ ఉత్తరాదిని టార్గెట్ చేయడం కూడా ఎవరికి అంతు చిక్కని విషయంగానే ఉండిపోయిందనేది ఆ కథనంలో స్పష్టమైంది.

వాళ్లనెందుకు రాజీనామా చేయమనలేదు?
కేంద్రంపై పోరాటం చేయకుండా.. అందుకోసం సుజనా, అశోకగజపతి రాజు లాంటి కేంద్రమంత్రులను రాజీనామా చేయమనకుండా.. కేవలం అవంతి శ్రీనివాస్ లాంటి వ్యక్తుల రాజీనామాతో పవన్ ఏం సాధించాలనుకున్నారనేది పవన్ కే తెలియాలని పరోక్షంగా ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. మొత్తానికి పవన్ ప్రసంగమంతా ఓ పజిల్ ను తలపించేదిగా ఉందే తప్పితే.. అందులో ఏ ఒక్కదానికి పవన్ నుంచి సరైన జవాబు రాలేదనేది సాక్షి కథనం.

జగన్ పరోక్ష కౌంటరేనా!?
ఇదంతా ఇలా ఉంటే.. కాకినాడ సభ ద్వారా ఏదో చేసేస్తాడనుకున్న పవన్, మునుపటి లాగే ఉసూరుమనిపించడంతో వైసీపీ మైలేజ్ కు పవన్ వల్ల వచ్చిన నష్టమేమి లేదని ఆ పార్టీలో ఒక అభిప్రాయం స్థిరపడినట్లుగా సమాచారం. ఒకవిధంగా పవన్ కు కౌంటర్ గా జగన్ తరుపున ఇదో పరోక్ష విమర్శ అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications