తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద తోసుకున్న భక్తులు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు తోడు కావడం వల్ల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్లమెంట్లు కిటకిటలాడుతున్నాయి. కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో ట్రావెలర్స్ బంగళా, శిలాతోరణం వరకూ క్యూలైన్ ఏర్పడుతోంది.
వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటోంది. శనివారం నాడు శ్రీవారి దర్శించుకున్న భక్తుల సంఖ్య 80 వేలను అధిగమించింది. ఆ ఒక్క రోజే 84,113 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 33,868 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.
గంటలపాటు కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్‌లల్లో వేచివుండాల్సి రావడం భక్తుల్లో అసహనానికి దారి తీస్తోంది. ఒకరినొకరు తోసుకోవడానికి, పరస్పరం ఘర్షణ పడటానికి కారణమౌతోంది. తాజాగా శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద కొందరు భక్తులు గొడవ పడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందిన వెంటనే ఆలయ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, భక్తులకు సర్దిచెప్పారు. క్యూలైన్‌ను క్రమబద్దీకరించారు. ఒక దశలో వారు చెప్పినా వినకుండా భక్తులు తోపులాటకు దిగడం కనిపించింది.












Click it and Unblock the Notifications