'తల్లికి వందనం' అమలు పై తాజా నిర్ణయం - అర్హతలు ఖరారు..!!
ఏపీ ప్రభుత్వం ఈ నెల 28న 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. 23 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా అధికారులతో ముఖ్య మంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ప్రాధాన్యతలను నిర్దేశించారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు నిధులు పైన సూచనలు చేసారు. అందులో భాగంగా తల్లికి వందనం, రైతుల కు అమలు చేయాల్సిన అన్నదాత సుఖీభవ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సంక్షేమం - కేటాయింపులు
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పెండింగ్ హామీల అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రానున్న ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్దిక సంవత్సరం లో ఈ పథకాలు అమలుకు నిర్ణయించారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం మే నెల నుంచి మూడు విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం పీఎం కిసన్ పథకం తరహాలో అమలు చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే అధికారులు ఈ పథకం నిర్వహణ భారం.. తీసుకోవాల్సిన చర్యల పైన ప్రభు త్వానికి నివేదిక సమర్పించారు.

నిబంధనలు ఖరారు
ఇక, కీలమైన అమ్మఒడి పథకం అమలు పైన తాజాగా కసరత్తు మొదలైంది. ఈ ఏడాది జూన్ లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికంగా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ లెక్క తేల్చింది. ఇక, ఈ పథకం అమలు కోసం దాదాపు రూ 10,300 కోట్లు అవసరమని అధికారులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఈ మేరకు ప్రస్తుత బడ్జెట్ తయారీ లో ప్రతిపాదనలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఒకే విడతలో అమ్మఒడి పథకం కింద జూన్ లో నిధులు విడుదలకు సూత్ర ప్రాయంగా నిర్ణయించారు.
పథకాలకు నిధులు
తల్లికి వందనం పథకం అమలు కోసం విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. అటు పథకాలు, ఇటు అభివృద్ది కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపు లు చేయడం సర్కారుకు సవాల్‌గా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారుల కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. దీంతో, మహిళలు - రైతులకు ఇచ్చిన హామీలకు ఈ బడ్జెట్ లో చేసే కేటాయింపులు ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, ప్రతీ మహిళకు నెలకు రూ 1500 ఇస్తామని ఇచ్చిన హామీ అమలు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది బడ్జెట్ లో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications