అధికారులకు చంద్రబాబు కీలక టాస్క్ -నేరుగా ప్రభావిత ప్రాంతాల్లో..!!
ఏపీని గజగజలాడించిన 'మొంథా' తీరం దాటింది. తుపాను ప్రభావంతో గాలుల ఇంకా పలు జిల్లాల్లో వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తుఫాను తీరం దాటే వేళ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించింది. తుఫాను తీరం దాటిన తరువాత పరిస్థితుల పైన సీఎం చంద్రబాబు సమీక్షించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. నష్టం పైన అధికారులు అంచనా వేస్తున్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వేకు బయల్దేరారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే చేయనున్నారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఓడలరేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ముఖ్యమంత్రి పరిశీలన చేస్తారు. ఏరియల్ సర్వేకు వెళ్లే ముందు జిల్లా కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించారు. తుఫాన్ నష్టం అంచనాలను త్వరితగతిన సిద్దం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు పలు సూచనలు చేసారు. గత నాలుగైదు రోజుల నుంచి మొంథా తుఫాన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టామని వివరించారు.
సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్‌తో సహా అంతా కలిసి టీమ్ గా పని చేసామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. మరో రెండు రోజులు ఇదే విధంగా పని చేస్తే... బాధిత ప్రజలకు మరింత ఊరట ఇవ్వగలమని పేర్కొన్నారు. తుఫాన్ వెలిసింది కాబట్టి... వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా అధికారులు పని చేయాలని సూచించారు.
మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి.. వారికేమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలని నిర్దేశించారు. మొంథా తుఫాను వల్ల వివిధ విభాగాల్లో కలిగిన నష్టాన్ని అంచనా వేయాలని... కేంద్రానికి నివేదిక అందివ్వాలని చెప్పారు. తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి... నిర్వాసితులను ఆదుకోవాలన్నారు.
ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని చెప్పుకొచ్చారు. తుఫాన్‌ను ఎవరూ నివారించలేరు... కానీ ముందు జాగ్రత్తలతో నష్టాలను నివారించగలుగతామని చెప్పారు. తుఫాన్ కారణంగా ఇద్దరు చనిపోయారని.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని చంద్రబాబు వివరించారు.












Click it and Unblock the Notifications