అమరావతిపై ఓటింగ్, పబ్లిక్ పల్స్ క్లియర్ - కీలక మలుపు..!!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాలను మూడేళ్లలోగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. దసరా నాటికి సీఆర్డీఏ భవనం ప్రారంభానికి నిర్ణయించారు. ఇదే సమయంలో రాజధాని లో కీలక నిర్మాణాల విషయంలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఐకానిక్ కేబుల్ వంతెన డిజైన్ పైన సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ప్రజల నుంచి ఓటింగ్‌కు పెట్టారు. ప్రజల మెజార్టీ ఓటింగ్ కు అనుగుణంగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్మాణం అమరావతిలో కీలక మలుపుగా మారనుంది.
అమరావతి నిర్మాణంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. రాజధాని అనుసంధానంలో కీలకమైన ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ వంతెన డిజైన్‌ను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ప్రజల నుంచి ఓటింగ్‌కు పెట్టారు. అన్నింటి కంటే ఎక్కువగా దాదాపు 14,000 వరకూ రెండో ఆప్షన్‌కు ఓట్లు పడ్డాయి. దీని వైపే చంద్రబాబు కూడా మొగ్గు చూపారు. ఇందుకనుగుణంగా డీపీఆర్ కూడా సిద్దమైందని తెలుస్తోంది. ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో దీనికి అనుగుణంగా ఐకానిక్ వంతెన నమూనాను రూపొందించారు. స్వస్తిక హస్త భంగిమలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ ఇది. నమూనాలో స్థానికతకు పెద్ద పీట వేశారు. నిప్పన్ కోయి లిమిటెడ్ డీపీఆర్‌ను తయారు చేసింది.

కాగా, అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణా నదికి అవతల ఎన్‌హెచ్ 65 వద్ద ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.22 కి.మీ పొడవున కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వంతెనను మూడు వరుసలుగా నిర్మిస్తారు. రెండు వైపులా కాలి బాటలు కూడా ఉంటాయి. మూలపాడు నుంచి 5 కిలోమీటరు దూరం ప్రయాణిస్తే అమరావతిలోకి అడుగుపెట్టవచ్చు.
దీని వల్ల 35 కిలోమీటరు దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద వంతెన ముగియనుంది. ఇక్కడ తేలికగా అటు విజయవాడ వైపు, ఇటు హైదరాబాద్ వైపు మారేందుకు ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మాణం చేట్టనున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లేందుకు ఈ వంతెన సరికొత్త ప్రవేశ మార్గంగా సిద్దం చేస్తున్నారు. ఐకానిక్ వంతెన రాకతో ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయి.












Click it and Unblock the Notifications