అలిపిరిలో భక్తుల కోసం బేస్‌క్యాంప్ - టీటీడీ ఇక వాట్సప్ సేవలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీకి కీలక ఆదేశాలు ఇచ్చారు. తిరుమలలో భక్తులకు దర్శనం.. వసతి తో పాటుగా సేవల విషయంలో మెరుగైన నిర్ణయాలు ఉండాలని నిర్దేశించారు. ప్రధానంగా వృద్ధులు ..దివ్యాంగుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. శ్రీవారి ప్రసాదం విషయంలో ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. సాంకేతికతను వినియోగించి.. భక్తులకు సేవలను మరింత పకడ్బందీగా అందించే లా చర్యలు తీసుకోవాలని సూచించిన చంద్రబాబు.. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం గురించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీపై సమీక్ష
తిరుమల తిరుపతి దేవస్ధానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భక్తుల సౌకర్యాలు మెరుగు పరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. టీటీడీ దర్శనాలు, వసతితోపాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు, సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి అభిప్రాయాలపై సమీక్ష చేపట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై అధికారుల నివేదిక ఇచ్చారు.

చంద్రబాబుకు నివేదిక
గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాఢవీధులలో ఏర్పాట్లను అధికారులు వివరించారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ది పనులు వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం వెలుపల నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు.
భక్తులకు వాట్సప్ సేవలు
టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సాప్‌లో అందిస్తామని అధికారులు చెప్పగా...వెంటనే వాట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం సూచించారు. ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్‌ను లింక్ చేయడం ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. మరోవైపు పారిశుధ్య నిర్వహణపైనా దృష్టి పెట్టాలని సిఎం అన్నారు. తిరుమలలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగిచుంకోవాలన్నారు. టీటీడీ పరిధి మొత్తం 2,675 హెక్టర్లలో విస్తరించి ఉండగా....ఇందులో ప్రస్తుతం 68.14 శాతం పచ్చదనం ఉంది. దీనిని 80 శాతానికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications