వైసీపీ నేతల అరెస్టుల పై మంత్రుల డిమాండ్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని, మనమూ వేధించటం సరికాదని వ్యాఖ్యానించారు. ఏడాది పాలన పైన మంత్రుల తో చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. పథకాల అమలు పైనా చర్చించారు. ప్రతీ మంత్రి మరింతగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. దూకుడు పెంచాలని నిర్దేశించారు. తల్లికి వందనం పథకం ఈ నెలలోనే అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం అధికారిక అజెండా తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో కలిసి భోజనం చేసారు. మంత్రులతో పలు అంశాల పైన చర్చించారు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు నేరస్థులను రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు, ఇప్పుడు నేర స్థులను అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్థులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశమిస్తూ రాజకీయాల్ని ఎటు తీసుకుపోతున్నారో అర్ధం కావట్లేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలని పిలుపునిచ్చారు.

అదే సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిర గటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పూ చేయకుండానే తెలుగు దేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష నుం చి తప్పించుకోలేరన్న చంద్రబాబు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధిం చారని, మనమూ వేధించటం సరికాదన్నారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని చెప్పారు. నేరం రుజువయ్యాక ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించటమే తమ విధానమన్న చంద్రబాబు, రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదన్నారు. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విడిగా కొద్దిసేపు చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడారు.
గతంలో మహానాడు నిర్వహణ అంటే ఎండ వేడికి స్టేజీ ఎక్కే సరికి చొక్కాలు తడిచిపోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పసుపు నీటిలో చొక్కాలు ముంచి తెచ్చినా ఎండ వేడికి ఇట్టే ఆరిపోయేవని గుర్తు చేసుకున్నారు. ఈసారి మహానాడు ఆహ్లాదకర వాతావరణం లో బాగా జరిగిందని చెప్పారు. కూటమి పట్ల ప్రజా సానుకూలతను మహానాడు చాటిందన్నారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసారు. కూటమి ఎన్నికల్లో గెలిచి ఈ రోజుతో ఏడాది పూర్తి కావటంతో కేబినెట్ సమావేశ ప్రారంభంలో మంత్రులు చప్పట్లతో చంద్రబాబును అభినందించారు.












Click it and Unblock the Notifications