మాస్టర్ ప్లాన్ అమలు చేస్తాం - చంద్రబాబు కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. అదే విధంగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పంలో బంగారు గనులున్నాయని చెబుతున్నారని..వాటి పైనా పరిశీలన చేస్తామని వెల్లడించారు.
కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్‌ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని, ప్రస్తుతం వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. టీటీడీ నిధులతో రూ.34 కోట్ల వ్యయంతో కుప్పంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కుప్పం అభివృద్ధిపై గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని విమర్శించారు. కుప్పానికి నీళ్లు తీసుకొచ్చామని సినిమా సెట్టింగులు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. కుప్పానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కొత్త అనుభూతి కలిగేలా ఎలిఫెంట్ సఫారీ, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

కుప్పం కోసం కొత్త ప్రణాళికలు
అదే విధంగా కుప్పం సమగ్ర అభివృద్ధి కోసం సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రజల విషయంలో తాను ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటానని, అయితే సంఘ విద్రోహ శక్తుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. సీమ ఫ్యాక్షనిజంపై సినిమాలు తీసే రోజులు పోయాయని, ఇప్పుడు రాయలసీమలో పరిస్థితులు పూర్తిగా మారాయని అన్నారు. మరో రెండేళ్లలో తన రాజకీయ జీవితం 50 ఏళ్లు పూర్తవుతుందన్నారు. అమరావతి వ్యవహారం పైన స్పందించిన సీఎం.. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత రాజధానిని మార్చడం సాధ్యం కాదని అన్నారు. అమరావతికి బదులుగా కొత్త పేర్లతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications