ఆ ముగ్గురు ఏపీ ఐఏఎస్ లకు చంద్రబాబు హామీ..!
ఏపీ-తెలంగాణ విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని అప్పట్లో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇరు రాష్ట్రాలకు కేటాయించింది. వీరిలో ఆయా ప్రాంతాలతో సంబంధం ఉన్న వారు, స్ధానికత, సివిల్స్ కు దరఖాస్తు చేసిన ప్రాంతాలు ఇలా పలు కారణాలతో అఖిల భారత సర్వీసుల అధికారుల్ని ఆయా రాష్ట్రాలకు కేటాయించారు. అయితే ఈ కేటాయింపులను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుల్ని, కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. వీటిలో హైకోర్టులో విచారణ ముగిసినా క్యాట్ లో ఇంకా కొనసాగుతోంది.
ఈ లోపే కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ డీవోపీటీ తాజాగా 11 మందిని తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిపోయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఈ నెల 16ను గడువుగా కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో వీరిలో కొందరు తిరిగి కోర్టుల్ని, క్యాట్ ను ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు. అలాగే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావాల్సిన ముగ్గురు ఐఏఎస్ లు హరికిరణ్, సృజన, శివశంకర్ కూడా సీఎం చంద్రబాబును కలిశారు.

హైదరాబాద్ అడ్రస్ తో సివిల్స్ పరీక్షలు రాశామనే కారణంతో తమను తెలంగాణకు కేటాయించారని సృజన, శివశంకర్ తెలిపారు. అలాగే జనరల్ కేటగిరీలో ఎంపికైన తనను రిజర్వేషన్ కేటగిరీలో పెట్టి తెలంగాణకు బదిలీ చేశారని హరికిరణ్ చంద్రబాబుకు వివరించారు. కాబట్టి తమను ఏపీలోనే కొనసాగేలా కేంద్రంతో మాట్లాడాలని చంద్రబాబును వీరు కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా వీరిని ఏపీలోనే కొనసాగించేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications