ఏకంగా డొనాల్డ్ ట్రంప్ కే కౌంటర్: అద్ది.. బాబుగారంటే
ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమానికి పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి అద్భుత స్పందన లభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ లక్షలాదిమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం సభ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యప్రసాద్.. తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. భారత్ ది డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. దీనికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. భారత్ ఎప్పటికీ డెడ్ ఎకానమీ కాబోదని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు.
ఒకప్పుడు భారత్ ను బీద దేశంగా గుర్తించే వాళ్లని, ప్రపంచంలో ఎక్కడికి పోయినా పేద దేశంగా చెప్పే వాళ్లని చంద్రబాబు అన్నారు. భారతీయులకు ఏదీ చేతకాదని చెప్పే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన దేశంగా భారత్ అవతరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 11 సంవత్సరాల్లో దేశం ఎంతగానో పురోగమించిందని చంద్రబాబు అన్నారు. అప్పట్లో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇప్పుడు నాలుగో స్థానానికి వచ్చిందని అన్నారు. 2028 నాటికి మూడో స్థానానికి ఎగబాకుతుందని ధీమా వ్యక్తం చేశారు.
భారత్ డెడ్ ఎకానమీ అని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. డెడ్ ఎకానమీ కాదని.. ప్రపంచంలోనే అతి వేగంగా దూసుకెళ్తోన్న ఆర్థిక వ్యవస్థ ఒక్క భారతదేశానిది మాత్రమేనని, ఎవ్వరూ పోటీ కూడా పడలేరని తేల్చి చెప్పారు. ఎవరిది డెడ్ ఎకానమీ అనేది భవిష్యత్ లో తేలుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications