స్వయంగా వడ్డించనున్న చంద్రబాబు
Chandrababu: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 70,824 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,674 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.84 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ నెల 30వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ విశ్వావసు నామ ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.
కాగా- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20వ తేదీన తిరుమలకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. భార్య భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనానికి రానున్నారాయన.
ఈ నెల 20వ తేదీన సాయంత్రం తిరుమలకు చేరుకుంటుంది చంద్రబాబు కుటుంబం. పద్మావతి అతిథి గృహంలో బస చేస్తుంది. ఆ మరుసటి రోజు అంటే 21వ తేదీన తెల్లవారు జామున చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. ఆ రోజున- మనవడు దేవాన్ష్ పుట్టినరోజు కావడమే.
21వ తేదీన దేవాన్ష్ పుట్టినరోజు కావడం వల్ల ఆ ఒక్కరోజు తిరుమల శ్రీవారి భక్తుల భోజనానికి అయ్యే మొత్తం ఖర్చును చంద్రబాబు భరించనున్నారు. దీనికి అవసరమైన ఒకరోజు మొత్తం ఖర్చు 44 లక్షల రూపాయలను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించనున్నారు. ఈ సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్నారు.












Click it and Unblock the Notifications