తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. జనసేన, బీజేపీతో కలిసి ఆ పని !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు చేసిన పనులను వివరించినట్లే.. ఇప్పుడు జీఎస్టీ ప్రయోజనాలను కూడా ఇంటింటికీ చేర్చాలని అన్నారు.
జీఎస్టీ ఉత్సవ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న జీఎస్టీ సంస్కరణల నిర్ణయాలు ప్రజలకు పెద్ద మేలు చేస్తున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా ప్రత్యేక తీర్మానం ఆమోదించి ఈ నిర్ణయానికి మద్దతు తెలిపామని గుర్తుచేశారు. ఈ సంస్కరణల వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం కొంత తగ్గినా.. ప్రజలకు లభించే ఆర్థిక ఉపశమనం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ప్రజలకు ప్రత్యక్ష లాభాలు..
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు నేరుగా లాభం కలుగుతోందని చంద్రబాబు వివరించారు. టూ వీలర్లు, కార్లు, ఏసీలు వంటి వస్తువుల ధరలు తగ్గాయని చెప్పారు. అలాగే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో సాధారణ కుటుంబాలకు ఉపశమనం లభించిందని.. ముఖ్యంగా రోగులు వాడే మందులపై జీఎస్టీ పూర్తిగా తొలగించడం ఆరోగ్య ఖర్చులను తగ్గించిందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఈ మార్పులతో ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర లాభం చేకూరుతోందని చెప్పారు. కూటమి పార్టీలతో కలిసి జీఎస్టీ ఉత్సవ్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
అంతే కాకుండా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలోనే కాదు, సాధారణ కాలంలో కూడా మంచి-చెడులను స్పష్టంగా ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను శ్రేణులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అలానే సూపర్ సిక్స్ సహా అనేక మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం అని, రాబోయే రోజుల్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
వైసీపీపై విమర్శలు..
ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ద్వంద్వ వైఖరిపై మండిపడ్డారు. అసెంబ్లీకి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాలేదని.. కానీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం సభకు హాజరయ్యారని గుర్తుచేశారు. ఇది ప్రజలకు అర్థమయ్యే ఒక డ్రామా తప్ప మరేదీ కాదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications