ఇక తప్పదు, మంత్రులకు తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక దిశా నిర్దేశం చేసారు. మంత్రులు ఇక ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో తాజా పరిణామాల పైన చర్చించారు. డీజిల్ సమస్య ఏర్పడ గానే ప్రభుత్వం సమస్య పరిష్కరించిందని.. ప్రస్తుతం సమస్య లేదని చెప్పారు. అమరావతి లో నిర్మాణ ఖర్చుల పైన ప్రతిపక్షం విష ప్రచారం చేస్తుందని.. తిప్పి కొట్టాలని నిర్దేశించారు. అదే విధంగా మంత్రులు సింగపూర్ పర్యటన పైనా చర్చ జరిగింది.
అమరావతి.. డీజిల్ వ్యవహారంలో ప్రభుత్వం పైన వైసీపీ విమర్శలు చేస్తుంటే మంత్రులు స్పందించరా అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. కేబినెట్ అధికారిక అజెండా పూర్తి అయిన తరువాత రాజకీయ అంశాల పైన చర్చించారు. సింగపూర్‌లో మంత్రుల శిక్షణపై వైసీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై ఏపీ కేబినెట్‌లో చర్చించారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 'మనం పాలనలో శిక్షణ కోసం, సంపద పెంపు కోసం వెళ్లాం. సింగపూర్ వాళ్లు ఎవరికీ ఇవ్వని అవకాశం మనకు ఇచ్చారు. దీనిపై కూడా వైసీపీ వాళ్లు రాద్ధాంతం చేయడాన్ని మనం ఖండించాలి. రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోవాలి. ఇతర దేశాల్లో చదరపు అడుగు ఎంతకు నిర్మిస్తున్నారు అనేది మనం తెలుసుకుని అసలు నిజాలు చెప్పాలి. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఇదే టెక్నాలజీతో చేసే నిర్మాణాల కంటే మనం తక్కువ ఖర్చుతో చేస్తున్నాం' అని సీఎం చెప్పారు. పాపులేషన్ మేనేజ్ మెంట్ పైన ఫోకస్ చేయాలని చంద్రబాబు సూచించారు.

మంత్రులకు చంద్రబాబు దిశా నిర్దేశం
అదే విధంగా అసెంబ్లీ, సచివాలయం భవనాలు, హైకోర్టు ఐకానిక్ స్ట్రక్చర్స్ వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేస్తున్నారని.. అందరూ వచ్చి చూసేలా భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు తెలిపారు. ధరల విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. పెట్రోల్, డీజిల్‌పై ప్రతిపక్షం చేసే విమర్శలకు సరైన సమాధానం చెప్పాలని సూచించారు. 'తొలుత ఇంధన కొరత వచ్చింది... మనం వెంటనే స్పందించాం. ఇప్పుడు పెట్రోల్ బంకులలో సాధారణ పరిస్థితి ఉంది' అని అన్నారు. ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రులు వెంటనే స్పందించాలన్నారు. సింగపూర్ వెళ్లి వచ్చిన మంత్రులు.. అక్కడ నేర్చుకున్న విషయాలను మిగతా మంత్రులకు వివరించే అంశంపై కూడా త్వరలోనే సమావేశం అవుదామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వేసవి కాలంలో మంచినీటి సరఫరా అంశం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ..దీనిపై మంత్రులు, జిల్లా ఇంచార్జ్ మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.













Click it and Unblock the Notifications