1335 కిలోమీటర్ల నేషనల్ హైవేలు, సీఎం మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు.
రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం కేవలం ప్రయాణాలకే పరిమితం కాకుండా ఆర్థిక పురోగతికి ఊతమిచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యంగా ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా 'పోర్ట్ కనెక్టివిటీ'ని పెంచాలని సూచించారు. గుజరాత్ మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని మూలపేట నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న అన్ని ప్రధాన పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల లాజిస్టిక్స్ వ్యయం తగ్గి, ఎగుమతులు, దిగుమతులు వేగవంతం అవుతాయని, తద్వారా పారిశ్రామిక, ఉద్యాన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం ఏర్పడుతుందని ఆయన వివరించారు.

గోదావరి పుష్కరాల లోపే రహదారుల నిర్మాణం!
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రహదారుల మరమ్మతులు, నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పుష్కరాల కోసం సుమారు రూ.400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా విధించారు. కుంభమేళా తరహాలో పుష్కరాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో జరిగే రోడ్ల అభివృద్ధి పనులు రాష్ట్రానికే రోల్ మోడల్‌గా ఉండాలని నిర్దేశించారు.
పాత్ హోల్ ఫ్రీ (గుంతలు లేని) రహదారులే లక్ష్యం!
రాష్ట్రంలో రహదారుల నిర్వహణ నిరంతర ప్రక్రియగా జరగాలని, రోడ్లపై ఎక్కడ గుంతలు కనిపించినా వెంటనే వాటిని సరిదిద్దేలా పటిష్టమైన యంత్రాంగం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ (Maintenance) చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. బ్లాక్ కాటన్ సాయిల్ (నల్లరేగడి నేల) ఉన్న ప్రాంతాల్లో వైట్ ట్యాప్ లేదా హైబ్రీడ్ మోడల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, కాలువల వెంబడి ఉన్న రోడ్ల విషయంలో కొత్త ఆవిష్కరణల కోసం విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేయించాలని అధికారులకు సూచించారు. రహదారుల నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని నొక్కి చెప్పారు.
జాతీయ రహదారులతోనే జాతి నిర్మాణం!
జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేవలం రోడ్ల వేయడంగా కాకుండా 'జాతి నిర్మాణం'గా భావించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఖరగ్ పూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్-శ్రీశైలం, కల్వకుర్తి-నంద్యాల వంటి కీలక ప్రాజెక్టుల వల్ల కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. వచ్చే రెండేళ్లలో 1335 కిలోమీటర్ల జాతీయ రహదారులు అందుబాటులోకి రానున్నాయని, ఈ ఏడాదిలో రూ.24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. రాజమండ్రి, తిరుపతి, కర్నూలు వంటి నగరాలకు ఔటర్ కారిడార్ మోడల్స్ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.
ఈవీ బస్సులతో తగ్గనున్న రవాణా వ్యయం..
ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యం కల్పించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్) బస్సుల వినియోగం పెంచాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఈవీ బస్సుల నిర్వహణ వ్యయం కిలోమీటరుకు రూ.72 గా ఉందని, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్టాండర్డైజేషన్ వంటి అంశాలపై దృష్టి సారించి ఈ వ్యయాన్ని మరింత తగ్గించాలని సూచించారు. భవిష్యత్తులో అన్ని కేటగిరీల్లోనూ ఏసీ ఈవీ బస్సులనే ప్రవేశపెట్టాలని, అలాగే పర్యావరణ హితమైన ఈ-సైకిళ్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications