పవన్ అటు- చంద్రబాబు ఇటు: డబుల్ ఇంజిన్
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. గ్రామ సభలతో దీనికి శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా గ్రామసభలను నిర్వహించాలని నిర్ణయించారు. నేడు రాష్ట్రంలో గల మొత్తం 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలను నిర్వహించబోతోన్నారు.

ఈ గ్రామసభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారు. నేడు అన్నమయ్య రాయచోటి జిల్లాలో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్. జిల్లాలోని మైసూరావారి పల్లిలో నిర్వహించే గ్రామసభకు హాజరు కానున్నారు. అనంతరం రాజంపేట అన్నమయ్య డ్యాం వరద బాధిత గ్రామమైన పులపుత్తూరుకు వెళ్తారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి కొత్తపేట మండలంలోని వానపల్లి గ్రామానికి చేరుకుంటారు.
11.50 నిమిషాలకు పళ్లాలమ్మ అమ్మవారి గుడి వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ గ్రామసభ కొనసాగుతుంది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారాయన. 2 గంటలకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమావేశమౌతారు.
అనంతరం 2.20 నిమిషాలకు వానపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45కు ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.35 నిమిషాలకు హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్తారు.
చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. వానపల్లిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసింది.












Click it and Unblock the Notifications