ఏపీ ప్రజలకు "సంక్రాంతి" శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. పవన్, లోకేష్ కూడా..
ఏపీ ప్రజలకు, తెలుగు వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన సీఎం.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం "మకర సంక్రాంతి" సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశిష్టమైన పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆయన కోరారు.
సంక్రాంతి పండుగ అనేది కేవలం పంటల పండుగ మాత్రమే కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను ప్రతిబింబించే మహత్తర పర్వమని చంద్రబాబు పేర్కొన్నారు. పాడిపంటలతో పల్లె సీమలు మరింత కళకళలాడాలని, గ్రామీణ జీవన విధానానికి మళ్లీ పూర్వ వైభవం రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆధునికతను స్వీకరిస్తూనే, మన సంప్రదాయాలను మరచిపోకుండా తరతరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.

ఈ పండుగ సందర్భంగా రైతన్నలు ఆనందంగా ఉండాలని, వారి కష్టం సార్థకమవాలని సీఎం రాసుకొచ్చారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని.. కష్టజీవులు తమ శ్రమకు తగిన ఫలితం పొందేలా ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దృఢంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది సంక్రాంతి పండుగను సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారి పల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నారు. గ్రామ వాతావరణంలో సంప్రదాయబద్ధంగా పండుగను ఆనందంగా గడుపుతూ, గ్రామస్తులతో మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా నారావారి పల్లెలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహిస్తూ పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు.
గ్రామస్తులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ద్వారా, పల్లె సంస్కృతిపై తన అనుబంధాన్ని మరోసారి చాటుకున్న చంద్రబాబు, గ్రామీణ జీవనమే భారతదేశ ఆత్మ అని పేర్కొన్నారు. ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం ‘‘మకర సంక్రాంతి’’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాడిపంటలతో పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నప్పటికీ, మన… pic.twitter.com/diGe84g8cw
— N Chandrababu Naidu (@ncbn) January 14, 2026












Click it and Unblock the Notifications