రూ.500 నోట్లు రద్దు చేయాల్సిందే - రెబల్స్ పైనా తేల్చేసిన సీఎం చంద్రబాబు..!!
పెద్ద నోట్ల రద్దు పై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రూ.500 నోటు రద్దు చేయాలని కోరారు. రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీని అడుగుతూనే ఉంటానని వెల్లడించారు. అవినీతి నిర్మూలనకు డిజిటల్ కరెన్సీ ఉత్తమమని, డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ చేసి గెలిచిన వారి విషయంలోనూ తమ నిర్ణయం ఏంటో చంద్రబాబు తేల్చి చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు పైన చంద్రబాబు మరోసారి తన డిమాండ్ ను స్పష్టం చేసారు. రూ 500 నోట్లను రద్దు చేయాలని కోరారు. నాడు డిజిటల్ కరెన్సీ పైన తన నాయకత్వంలో ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు. అదే విధంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచిన రెబల్స్ కు తిరిగి పార్టీలో అవకాశం ఉండదని చంద్రబాబు తేల్చి చెప్పారు. అర్నబ్, మురసు తుపాను సమయంలోనూ ప్రజల కష్టాల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇచ్చామన్న చంద్రబాబు.. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలు గుర్తించి ఎన్నికల్లో మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో రెండున్నరేళ్ల పాలన, అభివృద్ధికి ప్రజల ఆమోదం తెలిపారని, సుపరిపాలనకు ప్రజలు గౌరవం ఇచ్చారని వివరించారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

స్థానిక ఎన్నికల ఫలితాల పై విశ్లేషణ
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 55.3 శాతం ఓట్లు రాగా, తాజా స్థానిక ఎన్నికల్లో 3.6 శాతం పెరిగినట్లు చెప్పారు. అదే సమయంలో వైసీపీ ఓట్ల శాతం 39.81 నుంచి 33.56కు తగ్గిందని, 6.25 శాతం మేర తగ్గుదల నమోదైందని వెల్లడించారు. మొత్తంగా కూటమి, వైసీపీ మధ్య ఓట్ల శాతంలో 25.34 శాతం వ్యత్యాసం ఉందన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 59.9 శాతం ఓట్లు, వైసీపీకి 34.3 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. పట్టణాల్లో కూటమి స్ట్రైక్‌రేట్ 94 శాతంగా ఉందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 57.6 శాతం, వైసీపీకి 39.7 శాతం ఓట్లు వచ్చాయని, కూటమి స్ట్రైక్‌రేట్ 87.5 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూటమి, వైసీపీ మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం 25.60 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 17.9 శాతంగా ఉందని వివరించారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో వైసీపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదని చెప్పారు.













Click it and Unblock the Notifications
