పట్టణాలు.. పల్లెల్లో కూటమి- వైసీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం ఇలా.. ఇదీ జరిగింది: చంద్రబాబు.!!
స్థానిక ఫలితాల పైన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. మున్సిపల్, జెడ్పీటీసీ ఫలితాల ఓట్ల శాతాలను వివరించారు. కూటమికి 2024 కంటే గెలుపు శాతం పెరిగిందని చెప్పారు. అదే విధంగా అర్బన్- రూరల్ లో కూటమి.... వైసీపీకి వచ్చిన ఓట్ల గురించి వెల్లడించారు. తమ మీద మరింత బాధ్యత పెరిగిందని.. తాము అందించిన సుపరిపాలన కారణంగానే సత్ఫలితాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ప్రజలు కూటమికి అండగా ఉంటామని తీర్పు ఇచ్చారన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర విశ్లేషణ చేసారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు. పట్టణ, పరిషత్ ఎన్నికలను కలిపి కూటమి 58.9 శాతం ఓట్లు సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 33.56 శాతం ఓట్లు వచ్చాయని వివరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 55.3 శాతం ఓట్లు రాగా, తాజా స్థానిక ఎన్నికల్లో 3.6 శాతం పెరిగినట్లు చెప్పారు. అదే సమయంలో వైసీపీ ఓట్ల శాతం 39.81 నుంచి 33.56కు తగ్గిందని, 6.25 శాతం మేర తగ్గుదల నమోదైందని వెల్లడించారు. మొత్తంగా కూటమి, వైసీపీ మధ్య ఓట్ల శాతంలో 25.34 శాతం వ్యత్యాసం ఉందన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 59.9 శాతం ఓట్లు, వైసీపీకి 34.3 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు తెలిపారు.

ప్రజలు కూటమికి మద్దతుగా నిలిచారు
కాగా.. పట్టణాల్లో కూటమి స్ట్రైక్‌రేట్ 94 శాతంగా ఉందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 57.6 శాతం, వైసీపీకి 39.7 శాతం ఓట్లు వచ్చాయని, కూటమి స్ట్రైక్‌రేట్ 87.5 శాతంగా నమో దైందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూటమి, వైసీపీ మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం 25.60 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 17.9 శాతంగా ఉందని వివరించారు. మొత్తం 9,818 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 7,803 స్థానాలను గెలుచుకుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని సుమారు 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూటమి దక్కించుకునే అవకాశం ఉందన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి 65.7 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా, వైసీపీకి 27.42 శాతం వచ్చాయని తెలిపారు. పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏకు 62.83 శాతం, వైసీపీకి 31.46 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయని చెప్పారు.













Click it and Unblock the Notifications
